పోలీసు అమరవీరుల సంస్మరణ దినం (Police Martyrs Memorial Day) సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) న్యూఢిల్లీలోని చాణిక్యపురి జాతీయ పోలీస్ స్మారక స్థూపం వద్ద అసువులు బాసిన పోలీసు అమర వీరుల సేవలను స్మరిస్తూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh)తో కలిసి శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

అందులోని ముఖ్యాంశాలు..
పోలీసు వీరులారా.. మీ త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరవదు. మీ ధైర్య, సాహసాలు, త్యాగాలను స్పూర్తిగా తీసుకుని ముందుకు నడుస్తాం. ప్రజాస్వామ్యంలో తుపాకీ ఉండాల్సింది పోలీసుల, సైనికుల చేతుల్లోనే. బుల్లెట్ ను నమ్ముకున్న వాళ్లు కాలగర్బంలో కలిసిపోతారన్నది చరిత్ర చాటిన సత్యం. బ్యాలెట్ ను నమ్ముకున్న వాళ్లను ప్రజాస్వామ్యవాదులంతా స్వాగతించి అక్కున చేర్చుకుంటారన్నది అక్షర సత్యం. బుల్లెట్ ద్వారా సాధించిది ఏమీ లేదు. ప్రపంచవ్యాప్తంగా బ్యాలెట్ కు, బుల్లెట్ కు మధ్య ప్రతి ఘటనలో చివరకు గెలిచింది బ్యాలెట్ మాత్రమే.

భారతీయ జనతా పార్టీ మొదటి నుండి బుల్లెట్ ను వ్యతిరేకిస్తోంది. ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో హోంమంత్రి శ్రీ అమిత్ షా గారి మార్గదర్శకంలో కొనసాగుతున్న మావోయిస్టు నిర్మూలన తుది అంకానికి చేరుకుంది. బుల్లెట్ ను నమ్ముకున్న వాళ్లు పశ్చాత్తాపంతో ఆయుధాలను వదిలి జన జీవన స్రవంతిలోకి రావడాన్ని స్వాగతిస్తున్నాం. రాబోయే మార్చినాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడం తథ్యం.
