- సత్యసాయి, కడప జిల్లాలకు సీఎం చంద్రబాబు
- శ్రీసత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు హాజరు
- కడప జిల్లా నుంచి అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల
- అన్నదాత సుఖీభవ రెండో విడతలో 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,135 కోట్ల జమ
అమరావతి: సీఎం చంద్రబాబు రేపు రెండు జిల్లాల్లో పర్యటిస్తారు. శ్రీసత్యసాయి(Srisatyasai), కడప(Kadapa) జిల్లాల్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు హైదరాబాద్ నుంచి నేరుగా పుట్టపర్తి(Puttaparthi)కి చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం 9 గంటల 25 నిముషాలకు పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రధాని మోదీ(PM Modi)కి స్వాగతం పలుకుతారు.
మోదీతో కలిసి శ్రీసత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు(Centenary Celebrations of Sri Sathya Sai Baba) హాజరుకానున్నారు. 10 గంటలకు సాయి కుల్వంత్ హాల్‌లో భగవాన్ శ్రీసత్యసాయి మహా సమాధిని ఇరువురు నేతలు దర్శించుకోనున్నారు. అనంతరం శ్రీసత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించే శతజయంతి ఉత్సవాలకు మోదీ, సీఎం చంద్రబాబు హాజరవుతారు.
ప్రధాని మోదీకి వీడ్కోలు పలికిన అనంతరం ఒకటింబావుకు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రికి సీఎం చేరుకుంటారు. స్థానిక గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని సందర్శించి రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అక్కడే ఏర్పాటుచేసిన ప్రజావేదిక నుంచి అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ (Annadatha SukheeBhava-PM Kisan) రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు.
అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం రెండో విడతలో రూ.7 వేల చొప్పున 46,85,838 మంది రైతుల ఖాతాలకు రూ.3,135 కోట్లను జమచేస్తారు. ఆగస్టు 2న తొలి విడతగా రూ.7 వేలను జమచేశారు. రెండో విడతగా మరో రూ.7 వేల చొప్పున రైతులకు ప్రభుత్వం జమ చేయనుంది. రెండు విడతల్లో మొత్తంగా రూ.6,309.44 కోట్ల మేర ఆర్ధిక ప్రయోజనం రైతులకు కలుగుతోంది. ఈ కార్యక్రమం అనంతరం స్థానిక కేడర్‌తో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం రేపు రాత్రికి అమరావతికి రానున్నారు.
