అదేదో ఊరి నుండి పెద్ద శిల్పి వచ్చాడు.. మరేదో ఊరి నుండి పెద్ద బండ తెచ్చాడు.. ఆరడుగుల కొలతపెట్టి బండను ఖండించాడు.. మిగిలిన మూడడుగుల ముక్కను పక్కకు తోసేసాడు.. ఆరడుగుల బండేమో విగ్రహమై వెలసింది.. మూడడుగుల బండముక్క చాకిరేవు చేరింది.. కంపు కంపు మనసులన్ని దేవుని ఎదుట నిలిచాయి.. కంపుకొట్టే బట్టలన్నీ బండచుట్టూ చేరాయి.. గొంతెమ్మ కోర్కెల గొంతులన్ని తీర్ధంతో తడిచాయి.. మురికి మరకల బట్టలన్నీ నీటిలో మునిగాయి.. అర్ధం కాని స్తోత్రాలతో పూజారి భక్తి శ్రద్ధలు.. చాకలి నోటి వెంట ఇస్సు ఇస్సు శబ్దాలు.. శఠగోపం పవిత్రంగా ప్రతి తలను తాకుతోంది.. పవిత్రతకై ప్రతిబట్ట బండను బాదుతోంది.. కడకు గుడి నుండి మనసులన్ని కంపుతోనే వెళ్ళాయి.. రేవు నుండి బట్టలన్నీ ఇంపుగా వెళ్ళాయి.. గుడిలోని దేవుడా .. రేవులోని బండా…? ఎవరు దేవుడు…? ఎవరు గొప్ప..?
- కీ.శే. రంగనాథ్ (సినీ ఆర్టిస్ట్)
