Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeసాహిత్యంఆ మూడు రోజులు

ఆ మూడు రోజులు

ఇది నా ఇల్లే…
వీళ్లు నా వాళ్ళే…
అయినా నేనొంటరినే ఆ మూడు రోజులు..

నెలకోమారు మాయమయ్యే వెన్నెలలా
ప్రతినెల ఒంటరినై…
గడప ముందు బిచ్చగత్తెలా
అంటరానిదాన్నైన ఆ మూడు రోజులు..

ఏది ముట్టకూడదు, నిషిద్దజీవిలా
ఎటూ కదలకూడదు, శిలలా
మైలపడుతుందట నేనేది ముట్టినా
అది ఆ మూడు రోజులే…

ప్రేమగా నాపై నుండి వీచే గాలి,
నను కప్పిన ఆకాశం
తన ఒడిలో చోటిచ్చిన నేల
మైలపడవా ఆ మూడు రోజులు…

లోకోద్భవానికి…
రక్తాన్ని ధారపోస్తున్నా నేను
ప్రాణమిస్తూ వాయువు, తారోదయంతో మిన్ను ,
వృక్షం పుట్టుకకు మన్ను నిత్య ఘర్షణకే కాబోలు
మైలపడవు ఆ మూడు రోజులు

జగత్తు జనన మూలం ముట్టు
సృష్టి సంఘర్షణ స్థానం నా కడుపు
అందుకేనేమో ప్రతి మాసం
పొత్తికడుపు పేగు మెలిపెట్టే నొప్పి
అయినా నేనంటరానిదాన్నే…
ఒంటరిదాన్నే …
ఆ మూడు రోజులు.

ఆవుల రేణుక
9398268976

RELATED ARTICLES
- Advertisment -

Latest News