Sunday, October 26, 2025
ePaper
Homeఅంతర్జాతీయంPak-Afghan: అఫ్ఘానిస్థాన్‌, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం

Pak-Afghan: అఫ్ఘానిస్థాన్‌, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం

అఫ్ఘానిస్థాన్‌, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. తమ దేశంలో ఉంటున్న అఫ్ఘానిస్థానీలు వెంటనే వెళ్లిపోవాలని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అన్నారు. తమ భూభాగం, వనరులు 250 మిలియన్‌ల మంది పాక్ పౌరులకేనని తేల్చిచెప్పారు. ఆత్మగౌరవం ఉన్న ఏ దేశం కూడా ఇతర దేశాల మీద ఆధారపడదని చెప్పారు. అఫ్ఘానిస్థానీల కోసం కాబుల్‌లో ఇస్లామిక్ ప్రభుత్వం ఉందని గుర్తుచేశారు. తమను టార్గెట్ చేస్తున్న టెర్రరిస్ట్ సంస్థ తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్(టీటీపీ)కి చెక్ పెట్టేందుకు పాక్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. టీటీపీని తాలిబాన్ ప్రోత్సహింస్తోందని ఆరోపిస్తోంది. ఈ ఉద్దేశంతోనే పాకిస్థాన్ ముందుగా కాబుల్‌లోని టీటీపీ వర్గాలపై దాడులు చేసింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి.

తాజాగా 2 రోజుల పాటు కాల్పుల విరమణకు ఇరు దేశాలు ఒప్పుకున్నా పాక్ మాత్రం మళ్లీ దాడులకు దిగింది. అఫ్ఘానిస్థాన్‌లోని పట్కాయ్ ప్రావిన్స్‌లో అక్టోబర్ 17న జరిగిన దాడిలో ముగ్గురు క్రికెటర్లు చనిపోయారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జట్టుతో జరగాల్సిన టీ20 క్రికెట్ టోర్నీ నుంచి అఫ్ఘానిస్థాన్‌ తప్పుకుంది. పాకిస్థాన్ ఇండియాపైన కూడా ఆరోపణలు చేసింది. అప్ఘానిస్థాన్‌ను ఇండియా తమపైకి రెచ్చగొడుతోందని పిచ్చికూతలు కూసింది. ఒకవైపు ఇండియా, మరోవైపు అప్ఘానిస్థాన్‌తో ఒకేసారి తలపడాల్సి వస్తోందని పేర్కొంది. కాబూల్ పాలకులు ఇండియా పక్కన చేరి తమ‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని పాక్ విదేశాంగ మంత్రి నఖ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ఆరోపణలను అప్ఘానిస్థాన్ తోసిపుచ్చింది. తమ భూభాగంలో ఏ దేశ వ్యతిరేక కార్యకలాపాలకూ స్థానం లేదని తెలిపింది. పొరుగు దేశాలన్నిటితో మంచి సంబంధాలను కోరుకుంటున్నామని తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి ముత్తకీ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News