Friday, March 6, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంTelangana Summit | చరిత్రలో నిలవబోనున్న గ్లోబల్ సమ్మిట్

Telangana Summit | చరిత్రలో నిలవబోనున్న గ్లోబల్ సమ్మిట్

  • సదస్సుకు సర్వం సిద్ధం
  • నేడు మధ్యాహ్నం ప్రారంభం
  • ఒకటిన్నరకు ప్రారంభించనున్న గవర్నర్
  • సదస్సుకు భారత్ ఫ్యూచర్ సిటీలో భారీ ఏర్పాట్లు
  • ఆకట్టుకునేలా ముస్తాబైన హైదరాబాద్ నగరం
  • రేపు సాయంత్రం వరకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
  • 44కు పైగా దేశాల నుంచి రానున్న 154 మందిప్రతినిధులు
  • ఒక్క అమెరికా నుంచే వివిధ కంపెనీలకు చెందిన 46 మంది ప్రతినిధులు
  • భారీగా పెట్టుబడులకు ఆహ్వానం.. ప్రభుత్వ సహకారంపై చర్చ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit)-2025కు సర్వం సిద్ధమైంది. చరిత్రలో నిలవబోనున్న ఈ రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) నేడు మధ్యాహ్నం 1.30కి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు భారత్ ఫ్యూచర్ సిటీ(Bharat Future City)లో అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. విశ్వవ్యాప్తంగా పేరెన్నికగన్న కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్‌లో పాల్గొంటున్నాయి. 44కు పైగా దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు రానున్నారు. ఒక్క అమెరికా నుంచే వివిధ కంపెనీలకు చెందిన 46 మంది ప్రతినిధులు హాజరవుతారు. మొత్తమ్మీద సుమారు 2000 మంది దేశ, విదేశీ అతిథులు ప్రారంభ వేడుకకు హాజరవుతున్నారు.

నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈవో జెరెమీ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా, తదితరులు సమ్మిట్‌లో వివిధ అంశాలపై ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన(Praja Palana), పెట్టుబడులకు అవకాశాలు, ప్రభుత్వం నుంచి అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై వివరిస్తారు. రెండు రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెషన్లు జరుగుతాయి. ఈ మేరకు సెమినార్ హాళ్లను సిద్ధం చేశారు.

- Advertisement -

అంతర్జాతీయ, దేశీయ అతిథులు, పెట్టుబడిదారులకు తెలంగాణతోపాటు హైదరాబాద్ ప్రత్యేకతలు తెలిసేలా ప్రచార సామాగ్రిని సిద్ధం చేశారు. ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలో వేదిక వరకు వివిధ రూపాల్లో వీటి ప్రదర్శన ఉంటుంది. హైదరాబాద్ వ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీతో ప్రత్యేకంగా ప్రచార ఏర్పాట్లు జరిగాయి. లైటింగ్ ప్రొజెక్షన్, 3D ప్రాజెక్షన్ మ్యాపింగ్, ఎయిర్ పోర్టు అప్రోచ్ రోడ్‌లో ఎల్ఈడీ స్క్రీన్స్‌తో ఈ విభిన్న ప్రదర్శనలు ఉంటాయి.

సబ్జెక్టులపై చర్చల తర్వాత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీత కచేరి అతిథులను అలరించనుంది. అలాగే తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడీ, ఒగ్గు డొల్లు, పేరిణి నాట్యం, బోనాల ప్రదర్శనతో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది. నాగార్జునసాగర్ దగ్గర ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్కు బుద్ధవనం పర్యటనకు దౌత్య బృందం వెళ్లేలా టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

సదస్సు జరిగే రెండు రోజులు అతిథులందరికీ పసందైన హైదరాబాదీ బిర్యానీతోపాటు తెలంగాణ ప్రసిద్ద వంటలు, భోజనాలను అందించేందుకు వంటశాలలు సిద్దమయ్యాయి. అతిథులకు తెలంగాణ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా గ్లోబల్ సమ్మిట్ డెలిగేట్లకు ప్రత్యేక సావనీర్లతో కూడిన బహుమతిని ప్రభుత్వం తరపున అందించనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగో‌తోపాటు పోచంపల్లి ఇక్కత్ శాలువా, చేర్యాల కళాకృతులు, హైదరాబాదీ అత్తర్, ముత్యాలతో కూడిన నగలను ఈ సావనీర్‌లో పొందుపరుస్తారు. తెలంగాణ ప్రత్యేక వంటలైన ఇప్ప పువ్వు లడ్డు, సకినాలు, చెక్కలు, బాదం కీ జాలి, నువ్వు ఉండలు, మక్క పేలాలతో కూడిన మరో ప్రత్యేక బాస్కెట్‌ను కూడా అతిధులకు అందించనున్నారు.

అతిథులకు ఆహ్వానం పలకటానికి, ఆకట్టుకోవటానికి హైదరాబాద్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఒక వైపు మోడ్రన్ టెక్నాలజీని, మరోవైపు రాష్ట్ర ప్రత్యేకతలను ప్రతిబింబించేలా ప్రధాన ప్రాంతాలను ఆకర్షణీయంగా అలంకరించారు. ముఖ్యమైన కూడళ్లు, జలాశయాలు, రోడ్లు, సదస్సు వేదిక.. ఇలా అన్ని ప్రదేశాల్లోనూ హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు, విజువల్ ఎఫెక్ట్‌లు సెట్ చేశారు. దీంతో ఎటు చూసినా పండగ వాతావరణం కనిపిస్తోంది.

చారిత్రక కట్టడాలైన చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్, సచివాలయం, అమరవీరుల స్థూపం.. ఇలా అన్నింటికీ ప్రత్యేకంగా విద్యుద్దీపాలను పెట్టారు. తెలంగాణ విజన్ 2047 టార్గెట్లు అందరికీ తేలిగ్గా అర్థమయ్యేలా బోర్డులను ఏర్పాటుచేశారు. దుర్గం చెరువులోని గ్లోబ్ ఆకారంలో తేలియాడుతున్న ప్రొజెక్షన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇందులో సమ్మిట్ లోగోను షో చేయనున్నారు. వివిధ వర్గాలకు సంబంధించిన కార్యక్రమాలను ట్యాంక్‌బండ్‌లో వాటర్ ప్రెజెక్షన్ ద్వారా ప్రదర్శిస్తారు. మూడు ట్రిలియన్ల ఎకానమీ లక్ష్యాన్ని డిస్‌ప్లే చేస్తారు.

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సదస్సుకు వచ్చే మార్గంలో పెద్ద పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటుచేశారు. భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్లే రూట్, దూరం తదితర వివరాలను ఆ స్క్రీన్లలో తెలియజేస్తున్నారు. సమ్మిట్ లోగోతో కూడిన రంగురంగుల జెండాలను 15 వందలు తయారుచేయించారు. వీటిని నగరం నలుమూలలా నలుమూలలా కట్టారు. ఇవి సదస్సు వైభవానికి అద్దంపడుతున్నాయి. సిటీలోని పది ఏరియాల్లో స్పెషల్ ఇన్ఫర్మేషన్ స్టాల్స్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. అక్కడ సమ్మిట్ వివరాలను, ఫ్యూచర్ సిటీ ప్లాన్‌ను, సమ్మిట్ బ్రోచర్లు ఇస్తారు. సదస్సు షెడ్యూల్‌ని ప్రజలకు వివరించేందుకు వాలంటీర్లు ఉంటారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News