Wednesday, October 1, 2025
ePaper
Homeకెరీర్ న్యూస్Police Recruitment | పోలీస్ కొలువుల జాతర

Police Recruitment | పోలీస్ కొలువుల జాతర

  • మొత్తం 12,452 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తింపు
  • అత్యధికంగా సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 8,442
  • ప్రభుత్వానికి ఖాళీల వివరాలు సమర్పించిన పోలీస్ శాఖ
  • ఆర్టీఐ ప్రకారం పోలీస్ శాఖలో 91,169 పోస్టులు మంజూరు
  • 76,295 నియామకాలు పూర్తి, నియమించాల్సినవి 14,874

రాష్ట్ర నిరుద్యోగులకు నిజంగా ఇది పండగలాంటి వార్తే. త్వరలోనే దాదాపు 12 వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒకే శాఖలో సుమారు 12,452 ఖాళీలున్నాయని ఆర్థిక శాఖకు ఇచ్చిన నివేదికలో అధికారులు వెల్లడించారు. మిగతా శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు తీసుకుని.. జాబ్ క్యాలెండర్ రూపొందించి.. దాని ప్రకారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. త్వరలోనే దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు పోలీస్ శాఖ తమ విభాగంలోని ఖాళీల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. పోలీస్ ఉన్నతాధికారులు ఆర్థిక శాఖకు అందించిన నివేదిక ప్రకారం, రాష్ట్రంలో ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

వీటిలో అత్యధికంగా సివిల్ పోలీస్ కానిస్టేబుల్ విభాగంలో 8,442 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఆర్మ్ డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ పోస్టులు 3,271 ఉన్నాయి. ఈ రెండు కేటగిరీలలోనే దాదాపు 11 వేలకు పైగా ఖాళీలు ఉండటంతో, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న యువతకు ఇది గొప్ప అవకాశంగా మారనుంది. కానిస్టేబుల్ పోస్టులతో పాటు సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్సై) స్థాయి ఉద్యోగాలు కూడా గణనీయ సంఖ్యలో ఉన్నాయి. సివిల్ ఎస్సై కేటగిరీలో 677, ఏఆర్ ఎస్సై కేటగిరీలో 40, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ (టీజీఎస్పీ) విభాగంలో 22 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని నివేదికలో పేర్కొన్నారు. శాఖలవారీగా ఖాళీలపై దృష్టి సారించిన ప్రభుత్వం, వీలైనంత త్వరగా ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తోంది. ఆర్టీఐ ప్రకారం తెలంగాణ పోలీస్ శాఖలో 91,169 పోస్టులు మంజూరు కాగా 76,295 నియామకాలు జరిగాయి.

ఇంకా 14,874 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం పోలీస్ శాఖ ప్రభుత్వానికి నివేదించిన నివేదిక ప్రకారం దాదాపు అన్ని పోస్టులను భర్తీ చేసేందుకు పచ్చజెండా ఊపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీపై ఇచ్చిన హామీ మేరకు ఈ చర్యలు చేపట్టింది. ఎన్నికల సమయంలో ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, లక్షల కొలువులు భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో, ఆలస్యం అవుతోందన్న విమర్శలు వస్తున్న తరుణంలో, ఈ భారీ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రకటన నిరుద్యోగుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News