- 20 కోట్ల కుంభకోణం ఆరోపణలు
- డైరెక్టర్లపై మంత్రి సీరియస్..
- ప్రభుత్వానికి కనువిప్పు అవసరం..!
తెలంగాణ రాష్ట్రంలో నర్సింగ్ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇప్పుడు భారీ కుంభకోణ ఆరోపణలతో వార్తల్లో నిలిచాయి. జీఎనఎం, బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ పూర్తిచేసిన విద్యార్థులకు ఆరు నెలల పాటు ఐఈఎల్టీఎస్, టోఫెల్ శిక్షణ ఇచ్చి విదేశాలకు పంపించాల్సిన ఈ కేంద్రాలు కాగితాలపై మాత్రమే నడిచాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సెంటర్లు ఫుల్.. కానీ తరగతుల్లో ఖాళీ కుర్చీలు? : ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఈ ట్రైనింగ్ సెంటర్లు రికార్డుల ప్రకారం విద్యార్థులతో నిండిపోయినట్లు చూపుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని సమాచారం. తరగతుల్లో హాజరు తక్కువగా ఉండగా, రిజిస్టర్లలో మాత్రం పూర్తి హాజరు చూపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మన రాష్ట్రం నుండి నిజంగా ఎంతమంది నర్సింగ్ విద్యార్థులు విదేశాలకు వెళ్లారు? శిక్షణ పూర్తిచేసిన వారి అధికారిక లెక్కలు ఎక్కడ? ఈ ప్రశ్నలకు సంబంధిత అధికారులు, సెంటర్ యాజమాన్యాలు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
‘సిలికాన్ థంబ’తో ఫేక్ అటెండెన్స్..? విద్యార్థులు హాజరు కాకపోయినా బయోమెట్రిక్ ‘సిలికాన్ థంబ’ పద్ధతిని ఉపయో గించి ఫేక్ అటెం డెన్స్ నమోదు చేసినట్లు ఆరోప ణలు ఉన్నాయి. మధ్య వర్తుల ద్వారా ఇన్‌కమ్, కాస్ట్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి, నిబంధనలు ఉల్లం ఘించినట్టు కూడా ఆరోపణలు వెలువడు తున్నాయి. ఇది నిజ మైతే, ఇది సాధారణ నిర్లక్ష్యం కాదు. పథకం మొత్తాన్ని దోపిడీ చేసే విధంగా పన్నిన ఘరానా మోసమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రూ. 12 నుంచి 20 కోట్ల వరకు దోపిడీ..? విద్యార్థులకు సరైన శిక్షణ ఇవ్వకుండానే సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి 12 నుంచి 20 కోట్ల రూపాయలు డ్రా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నిధులు ఎక్కడికి మళ్లాయి? ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయి? ఎలాంటి ఆడిట్ జరిగింది? అన్న ప్రశ్నలు ప్రభుత్వాన్ని చుట్టు ముడుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందనే అనుమానాలు వ్యక్తమవుతుండగా, ఇది ప్రజా ధనంపై జరిగిన ఘోర దాడిగా భావిస్తున్నారు.
మంత్రి సీరియస్ – డైరెక్టర్లపై ఆగ్రహం : ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి ఆరా తీసినట్టు సమాచారం. సంబంధిత సెంటర్ల డైరెక్టర్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. నిధుల విని యోగంపై పూర్తి వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది.
సమగ్ర విచారణకు డిమాండ్ :
ఈ అంశంపై సీజేఎస్ అధ్యక్షులు ప్రభు త్వానికి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసి నట్లు తెలిపారు. నర్సింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంట ర్లలో జరిగిన నిధుల లావాదేవీలపై తక్ష ణమే సమగ్ర విచారణ చేపట్టి, నిజానిజాలు ప్రజల ముందుంచాలని ఆయన డిమాండ్ చేశారు. నిధుల దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విదేశాలకు వెళ్లిన విద్యార్థుల అసలు సంఖ్యను అధికారికంగా ప్రకటించాలని కోరారు.
ప్రభుత్వానికి కనువిప్పు అవసరం..
నర్సింగ్ విద్యార్థుల భవిష్యత్తు, ప్రజా ధనం, ప్రభుత్వ ప్రతిష్ట ఈ మూడు అంశాలు ఈ కుంభకోణంలో కీలకంగా మారాయి. కేవలం ఆదేశాలు సరిపోవు.. పారదర్శక విచారణ, ఆడిట్, బాధ్యులపై కఠిన చర్యలే ప్రజలకు నమ్మకం కలిగిస్తాయి. ఇప్పుడు ప్రశ్న ఒకటే ఈ ఆరోపణలు నిజమైతే, బాధ్యులపై ప్రభుత్వం ఎంత త్వరగా, ఎంత కఠినంగా చర్యలు తీసుకుంటుంది? రాష్ట్రవ్యాప్తంగా ఇదే చర్చ కొనసాగుతోంది.
