- గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా బిజెపి చేసిన పోరాట ఫలితమే ఈ తీర్పు
- జాబ్ క్యాలెండర్ దేవుడెరుగు.. ఒక్క పరీక్ష కూడా సరిగ్గా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం
- ఇప్పటికైనా పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దుకోవాలి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
గ్రూప్-1 పరీక్ష పత్రాల రీవాల్యూయేషన్ చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. గ్రూప్ 1 అభ్యర్థుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు. పరీక్ష నిర్వహణలో గందరగోళం సృష్టించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విషయాన్ని తాము మొదటినుంచి చెబుతున్నామని ఆయన గుర్తుచేశారు. కేవలం మొండిపట్టుకు పోయి వేలాదిమంది అభ్యర్థుల జీవితాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెలగాటమాడిందని ఆయన దుయ్యబట్టారు. నోటిఫికేషన్ విడుదల నుంచి ఆన్సర్ షీట్స్ మూల్యాంకనం వరకు అన్నీ తప్పుడు విధానాలనే టీజీపీఎస్సీ అవలంభించిందని రాంచందర్ రావు ఆరోపించారు.
గ్రూప్-1 అభ్యర్థుల అభ్యర్థనలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రాంచందర్ రావు విమర్శించారు. పరీక్ష నిర్వహణలో గందరగోళం, మూల్యాంకనంలో అవకతవకలపై అభ్యర్థులకు మద్దతుగా కేంద్రమంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ తో సహా పార్టీ ప్రజాప్రతినిధులు ప్రత్యక్ష పోరాటం చేశారని రాంచందర్ రావు గుర్తుచేశారు. భారతీయ జనతా యువమోర్చా నిరంతర పోరాటాలు కొనసాగించిందని ఆయన వివరించారు. ఒక పరీక్ష కేంద్రంలోని ఒకే గదిలో పరీక్ష రాసిన అభ్యర్థులు ఎక్కువమంది సెలక్ట్ కావడం, మూల్యాంకనం పూర్తిగా లోపభూయిష్టంగా నిర్వహించడంతో వేలాది మంది గ్రూప్-1 అభ్యర్థులను తీవ్ర మనోవేదనకు గురయ్యారని ఆయన వివరించారు.
ప్రతిఏటా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి కనీసం ఒక్క పరీక్షను కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారని రాంచందర్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక హైకోర్టు ఈ స్థాయిలో మొట్టికాయలు వేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని రాంచందర్ రావు పేర్కొన్నారు. గ్రూప్-1 నిర్వహణ ఎంత తప్పులతడకనో హైకోర్టు నిగ్గుతేల్చిందని రాంచందర్ రావు అన్నారు. ఇప్పటికైనా బుద్దితెచ్చుకొని నిరుద్యోగ జీవితాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడుకోవద్దని ఆయన హెచ్చరించారు.