42% రిజర్వేషన్లకు కాంగ్రెస్‌లోని అగ్ర కులాల వారి కుట్ర
టీఆర్పీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న
సూర్యాపేట, డిసెంబర్ 3 (ఆదాబ్ హైదరాబాద్): 2028లో తెలంగాణ రాష్ట్రంలో బీసీల ప్రభుత్వం రావడం తథ్యమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (Telangana Rajyadhikhara Party-TRP) రాష్ట్ర అధ్యక్షుడు(State President), ఎమ్మెల్సీ (MLC) తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) అన్నారు. మునిసిపాలిటీ పరిధిలోని గాంధీ నగర్‌లో టీఆర్పీ ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి మల్లన్నతోపాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు (BC Reservations) ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి కులాల (Reddy Caste) వాళ్లే కుట్రలు పన్నారని ఆరోపించారు.
ఏడు దశాబ్దాలుగా దేశంలో, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లతో గద్దెనెక్కి మోసం చేశారని విమర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు నామినేషన్ వేయకుండా అగ్ర కులాల వాళ్లు కుట్రలు పన్నడం పిరికిపందల చర్య అని మండిపడ్డారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లారెడ్డిగూడెం, నాగార్జునసాగర్ దీనికి ఉదాహరణ అని చెప్పారు. ఇలాంటి పరిస్థితి అనేక ప్రాంతాల్లో ఉత్పన్నమవుతోందని, బహుజనులు పదవులను అనుభవించవద్దా అని ప్రశ్నించారు. బహుజనులు చైతన్యవంతులు కాకపోతే తీవ్ర అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు.
పోరాడితే పోయేదేంలేదు.. బానిస సంకెళ్ల తప్ప అనే నినాదంతో బహుజనులంతా ఏకమై రాజ్యాధికారం దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మన జాతి బిడ్డలకే మనం ఓట్లు వేసేలా ప్రజల్ని సంఘటితపరిచి ఆ దిశగా కృషి చేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా పేదలకు భూమి పంపిణీ, విద్యా, వైద్యం, మైనార్టీలకు న్యాయం చేసేలా టీఆర్పీ మేనిఫెస్టో ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, చాంద్ పాషా, నరసయ్య, ఆవుల అంజయ్య, ఇందిర, రజిత, సూపర్ సైదులు, కుంభం నాగరాజు, బొల్లె సైదులు, బొమ్మగాని సైదులు గౌడ్, లింగస్వామి గౌడ్, వల్లాల సైదులు, లింగాల సైదులు, జానకి రాములు, లింగరాజు, మల్లయ్య యాదవ్, కోల కర్ణాకర్, బోడపట్ల మధు, తదితరులు పాల్గొన్నారు.
