కొనుగోలు చేసిన ‘ఆరో రియల్టీ’
హైదరాబాద్ ఐకాన్ల(Hyderabad Icon)లో ఒకటైన ప్రఖ్యాత తాజ్ బంజారాను రూ.315 కోట్లకు విక్రయించారు. 50 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన చెరువు పక్కన ఉన్న ఈ హోటల్‌ను అరబిందో ఫార్మా (Aurobindo Pharma) యాజమాన్యంలోని రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థ ఆరో రియల్టీ (Auro Realty) సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. 16,645 చదరపు గజాల విస్తీర్ణంతోపాటు 1,22,751 చదరపు గజాల నిర్మాణం కలిగిన తాజ్ బంజారా త్వరలో కనుమరుగైనా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఈ హోటల్ స్థానంలో మరో కట్టడం నిర్మించడం ఖాయమని సమాచారం.
ఈ డీల్‌ని భాగ్య నగరంలోని స్థిరాస్తి వ్యాపార (Real Estate Business) రంగంలో కీలక ఒప్పందంగా చెబుతున్నారు. ఈ లగ్జరీ హోటల్(Luxury Hotel)లో 270 గదులు ఉన్నాయి. తాజ్ బంజారా కొనుగోలు కోసం స్టాంప్ డ్యూటీ కింద రూ.17.3 కోట్లు చెల్లించినట్లు వార్తలు వస్తున్నాయి. గడచిన రెండేళ్లుగా ట్యాక్స్‌లు చెల్లించకపోవడంతో 2025 ప్రారంభంలో జీహెచ్ఎంసీ ఆఫీసర్లు ఈ హోటల్‌ను లాక్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే.. బకాయిపడ్డ పన్నుల్లో కొంత మొత్తం చెల్లించడంతో తిరిగి కార్యకలాపాలు ప్రారంభమైనట్లు వినికిడి.
తాజ్ బంజారాను చేజిక్కించుకున్న ఆరో రియాల్టీ.. ఈ బిల్డింగ్‌ను ఎలా వాడుకుంటుంది అనేదానిపై ఆ సంస్థ ప్రకటన చేయలేదు. హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన బంజారాహిల్స్‌లో ఈ హోటల్ ఉండటం విశేషం. దీనికి చుట్టుపక్కల విలాసవంతమైన నివాసాలు, కార్పొరేట్ ఆఫీసులు, ప్రీమియం రిటైల్ యాక్టివిటీస్‌కి ఈ ఏరియా ఫేమస్. ఎంతో ప్రముఖులు ఇక్కడ నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజ్ బంజారా అమ్మకం వ్యవహారం ఆసక్తికరంగా మారింది.
