- సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్.
చివ్వెంల మండల పరిధిలో జరగనున్న సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని సూర్యాపేట డిఎస్పి ప్రసన్న కుమార్ కోరారు. సోమవారం మండల కేంద్రంతో పాటు చందుపట్ల గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి, ప్రజలతో ఎన్నికల నిర్వహణలో నిబంధనలు, జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డి.ఎస్.పి మాట్లాడుతూ..
ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని, గ్రామాల్లో శాంతియుత వాతావరణం కొనసాగేందుకు స్థానిక పోలీసులు, ఎన్నికల సిబ్బందికి ప్రజలు సంపూర్ణ సహకారం ఇవ్వాలని అభ్యర్థించారు. మండలంలో పరిస్థితులు చక్కబెట్టేందుకు ముందస్తు చర్యలలో భాగంగా సమస్యలు సృష్టించే వ్యక్తులను గుర్తించి ఇప్పటికే 25 మందిని బైండ్‌ఓవర్ చేసినట్లు తెలిపారు. బైండ్‌ఓవర్ నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో రూ. 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పూచీకత్తు నగదు విధించేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ప్రజలను డబ్బు, మద్యం, ఇతర బహుమతులతో ప్రభావితం చేసే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. బరిలో నిలబడేది మన సొంత గ్రామ ప్రజలే, అందుకే ఎవరూ వ్యక్తిగత విమర్శలు చేయకుండా పరస్పర గౌరవంతో నడుచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ రాజశేఖర్, స్థానిక ఎస్సై మహేశ్వర్, రత్నం,పెనపహాడ్, ఆత్మకూరు యస్ .ఐ లు, స్పెషల్ పార్టీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
