Monday, April 6, 2026
Homeసాహిత్యంSrisailam | జ్యోతిర్లింగం, శక్తి పీఠం దివ్యక్షేత్రం శ్రీశైలం

Srisailam | జ్యోతిర్లింగం, శక్తి పీఠం దివ్యక్షేత్రం శ్రీశైలం

  • ఏప్రిల్ 7… శ్రీ శ్రీశైలం భ్రమరాంబిక కుంభోత్సవం

తెలుగు నేలపై కొలువైన దివ్యక్షేత్రం శ్రీశైలం. జ్యోతిర్లింగం, శక్తి పీఠం ఒకే గిరి శృంగం మీద వెలసిన పరమ పవిత్ర స్థలంగా భాసిల్లుతున్న క్షేత్రం. పన్నెండు జ్యోతిర్లింగాలలో రెండవది, శ్రీభ్రమరాంబా దేవికి నెలవైన శక్తిపీఠం. శైవక్షేత్రాల్లో తలమానికం. మల్లికార్జున మహాలింగ చక్రవర్తి కొలువై ఉండి, సకల లోకారాధ్యంగా, త్రైలోక్య పూజితంగా విరాజిల్లు తున్నది. సంకల్ప, పూజా సందర్భాలలో శ్రీశైలానికి ఏ దిగ్బాగంలో ఉన్నామో భగవంతునికి తెలియ చేసుకునే సాంప్రదాయాన్ని బట్టి క్షేత్ర ప్రాధాన్యత స్పష్టం అవుతున్నది.

పురాణాల్లో వర్ణితమైన ఎనిమిది శృంగాలతో, నలభై నాలుగు నదులు, అరవై కోట్ల తీర్థరాజాలు, పరాశర, భరద్వాజాది మహర్షుల తపోవన సీమలతో, చంద్ర, సూర్య కుండాది పుష్కరిణులతో, లతలు, వృక్ష సంతతులు, అనేక లింగాలు, అద్భుత ఔషధాలు కలిగి శ్రీశైల మల్లన్న దేవుని సన్నిధికి చేర్చే దారి అత్యంత ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

- Advertisement -

బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అనే మూడు పర్వతాలకు పాదాభి వందనం చేస్తూ వేదఘోషను ప్రతిధ్వ నింప చేస్తూ, పాతాళగంగ నామాంకిత అయిన కృష్ణవేణీ నది ఈ ప్రదేశంలో ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్నది. అష్టాదశ పురాణాల్లోనూ భారత రామాయణాది ఇతిహాసా ల్లోనూ శ్రీశైల వైభవం వర్ణించ బడింది. కృతయుగంలో హిరణ్య కశిపుడు శ్రీశైలాన్ని తన పూజా మందిరంగా చేసుకొన్నాడు. పురాణాల ప్రకారం సీతారాములు ప్రతిష్ఠించిన సహస్ర లింగాలు, పాండవులు భక్తితో స్థాపించిన సద్యోజాత లింగం, పంచపాండవ లింగాలు పూజార్హత కలిగి అలరారు తున్నాయి. సంస్కృత, ఆంధ్ర, కన్నడ, మరాఠీ గ్రంథాల్లో ఈ క్షేత్రాన్ని గురించిన వర్ణనలున్నాయి. పలు భాషల కవులు క్షేత్ర ప్రాధాన్యతను అభివర్ణించారు.

స్కాంద పురాణంలోని శ్రీశైల ఖండం, ఈ క్షేత్ర మహత్తును వివరిస్తోంది. ఈ క్షేత్ర ప్రశాంతతకు ముగ్ధులైన ఆది శంకరులు కొంత కాలం ఇక్కడ తపస్సు చేసి, శివానంద లహరిని రచించి, మల్లి కార్జునుడికి సమర్పించి, భ్రమరాంబ సన్నిధిలో శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారు. దత్తావతార పరంపరలో భక్తుల పూజలందుకొనే నృసింహ సరస్వతీ స్వామి శ్రీశైల మహత్యాన్ని వివరి స్తూ తన పాదుకల్ని పట్టుకొన్న తంతుడు అనే భక్తుడికి ఈ క్షేత్ర దర్శన భాగ్యాన్ని కలిగించినట్లు గురుచరిత్ర చెబుతోంది. నృసింహ సరస్వతి స్వామి ఇప్పటికీ కదళీవనంలో గుప్తరూపంలో ఉన్నట్లు దత్తాత్రేయ భక్తులు విశ్వసిస్తారు.

శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి ఇక్కడి మఠాలలో ఉన్న సాధకులు, యోగుల వసతి కోసం క్రీస్తుపూర్వం నుంచి అనేక రాజవంశాలు ఎన్నో దానాలను గావించి నట్లు శిలాశాసనాలు, చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణు కుండినులు, పల్లవులు, రాష్ట్ర కూటులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర సామ్రాజ్యాధీశులు, భ్రమరాంబికా సమేతులైన మల్లికార్జునుణ్ణి దర్శించి భక్తుల సౌకర్యాలకు ఎన్నో ఏర్పాట్లు, అశేష వస్తు సంపదలు సమర్పించారు.

శ్రీశైలంలో పంచ మఠాలు ప్రాచీన మైనవి. మొదటిదైన ఘంటామఠం – శ్రీశైల ఆలయానికి వాయువ్య దిశగా ఉంది. శివ సాధకుడైన ఘంటాకర్ణ సిద్దేశ్వరుడు తన శిష్యులతో కలిసి దీనిని ఏర్పాటు చేశారు. రెండోదైన విభూతి మఠం, శ్రీకృష్ణ దేవరాయల కాలపు వీరశైవుడైన శాంతి మల్లయ్య అనే వ్యక్తి పేరు మీదుగా ఏర్పడినట్లు పరిశోధనలు వివరిస్తున్నాయి. మూడోదైన రుద్రాక్ష మఠాన్ని మల్లి శంకరస్వామి అనే భక్తుడు నిర్మించాడని తెలుస్తోం ది. ఇక్కడికి వచ్చే భక్తులకు అతడు రుద్రాక్షలను పంచిపెడు తుండేవాడని స్థానికులు చెబుతుంటారు. నాలుగోదైన సారంగ మఠాన్ని సారంగేశ్వరముని నిర్మించాడని చరిత్ర చెబుతోంది.

దీనికి సంబంధించిన లిఖిత ఆధారంగా క్రీ.శ.1585 నాటి శాసనం మఠంలో లభ్యమైంది. అయిదోదైన నంది మఠంలో నందికేశ్వరుడు అనే యోగి సుదీర్ఘకాలం జీవించాడు. ఇది ఘంటా మఠానికి వైపు ఉండేది. ఇవే కాకుండా శ్రీశైలంలో పలు మఠాలు ఉండేవి. వాటిలో వీరశైవ సిద్ధాంత భిక్షావృత్తి మఠం ప్రసిద్ధమైంది. క్రీ.శ. 1518లో దీనిని సిద్ధ భిక్షావృత్తి భార్య, శిష్యుడు పర్వతయ్యలు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి చాలాకాలం ముందే 3వ కుళోత్తుంగ చోళుడు ఒక మఠాన్ని క్రీ.శ. 1178-1216 మధ్య కాలంలో ఏర్పాటు చేసినట్టుగా చరిత్ర చెబుతోంది.

వటసిద్ధి మఠం, చంద్రమఠం, కమరీ మఠం అనే మఠాలు భక్తులకు అన్నవసతి ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకా అనేక మఠాలు పదహారో శతాబ్దికి పూర్వం నుంచే ఇక్కడ ఉన్నాయి. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న శ్రీశైల క్షేత్రంలో ప్రతీ సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారాలలో (ఏరోజు ముందుగా వస్తే ఆ రోజు) కుంభోత్సవం జరుగుతుంది. శ్రీ భ్రమరాంబా అమ్మవారికి సాత్విక బలి సమర్పించేందుకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.

భారీగా గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నరాశి మొదలైనవి అమ్మవారికి బలిగా సమర్పించడం ఈ ఉత్సవ సంప్రదాయం. ప్రసిద్ధమైన ఈ ఉత్సవాలలో అమ్మవారికి జరిగే కుంభోత్సవంను శ్రీశైలములో నివసించే స్థానికులందరూ ఈ ఉత్సవాన్ని తమ ఊరిపండుగ (క్షేత్ర పండుగ) అని భావిస్తారు. ఆ రోజు దాదాపుగా స్థానికులందరూ అమ్మవారిని విధిగా దర్శించుకుంటారు. ఉత్సవం సందర్భంగా అమ్మవారి ఆలయమంతా పలురకాల పుష్పాలతో, నిమ్మకాయదండలతో, వేపమండలతో అలకరించ బడుతుంది.

కుంభోత్సవం నాడు ముందుగా అమ్మవారికి ప్రాత: కాలపూజలు, అర్చకస్వాములు నవావరణ పూజ, త్రిశతి, ఖడ్గమాల, సహస్రనామ, అష్టోత్తరపూజలు, జప పారాయణలను ఏకాంతములో నిర్వహిస్తారు. అర్చకులు తప్ప ఇతరులెవరూ ఈ పూజలను వీక్షించే అవకాశం ఉండదు. కుంభోత్సవం కారణంగా ఆ రోజు తెల్లవారు జామునుండే అమ్మవారి ఆలయ తలుపులు మూసివేయబడి ఉంటాయి.

సాయంకాలం సూర్యాస్తమయం అయిన తరువాతనే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. చెంచులుగా పిలువబడే ఇక్కడి స్థానిక గిరిజనులు భ్రమరాంబాదేవిని తమ ఆడపడుచుగా, స్వామి వారిని తమ అల్లునిగా భావిస్తారు. అందుకే చెంచులు కుంభోత్సవం తమ ఇంటి పండుగా భావించి, ఆనందోత్సవాలతో ఈ ఉత్సవంలో పాల్గొంటారు.

పెద్దసంఖ్యలో గుమ్మడి కాయలు, కొబ్బరి కాయలు, నిమ్మ కాయలు అన్నపు రాశులను శక్తి స్వరూపిణియైన భ్రమరాంబ దేవికి స్వాతికమైన పద్ధతిలో బలిని సమర్పించడమే ఈ ఉత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం.

అమ్మవారికి కుంభోత్సవం జరుగుతుంటే మరోవైపు స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు, సర్వదర్శనం నివేదనలు మొదలైనవన్నీ యథావిధిగా జరుప బడతాయి. ఆరోజు స్వామి వారికి ప్రదోషకాల పూజలయ్యాక, పెరుగు కలిపిన అన్నాభిషేకంతో స్వామి వారి మూల మూర్తిని పూర్తిగా కప్పి వేస్తారు. అనంతరం అమ్మవారికి ఉత్తర పూజలు చేసి 9 రకాల పిండివంటలను నివేదించడంతో ఈ ఉత్సవం ముగుస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News