- స్లో ఓవర్ రేట్ కారణంగా రూ. 12 లక్షల ఫైన్..
ఐపీఎల్‌లో మంగళవారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు మూడు వికెట్ల తేడాతో విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కు జరిమానా విధించారు. స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి 12 లక్షల ఫైన్ వేశారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 కింద ఈ సీజన్ తొలి నేరంగా పరిగణిస్తూ .. స్లో ఓవర్ రేటు కింద అయ్యర్‌కు జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ తన ప్రకటనలో తెలిపింది. ముల్లాన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తుచేసి విజయంతో టైటిల్ వేటను మొదలెట్టింది పంజాబ్ జట్టు.
గిల్ సేన నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కింగ్స్.. 19.1 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి గెలుపు బోణీ కొట్టింది. ఈ లీగ్‌లో అరంగేట్ర మ్యాచ్ ఆడిన కూపర్ కనోలి (44 బంతుల్లో 72 నాటౌట్, 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధశతకానికి తోడు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (24 బంతుల్లో 37, 1 ఫోర్, 4 సిక్స్‌లు) రాణించారు. పంజాబ్ ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్ చేసిన టైటాన్స్.. బ్యాటర్ల వైఫల్యంతో 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ గిల్ (27 బంతుల్లో 39, 6 ఫోర్లు), జోస్ బట్లర్ (33 బంతుల్లో 38, 3 ఫోర్లు, 2 సిక్స్) మినహా మిగిలినవారంతా తేలిపోయారు.
