Friday, September 12, 2025
ePaper
spot_img
Homeరాజకీయంగాంధీ భవన్‌కు సెక్యూరిటీ పెంపు

గాంధీ భవన్‌కు సెక్యూరిటీ పెంపు

మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యం

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ప్రధాన కార్యాలయమైన గాంధీ భవన్‌కు భద్రత పెంచినట్లు సమాచారం. త్వరలో కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రి పదవులను ఆశించి దక్కక భంగపడ్డవారు తమ వర్గీయులతో పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టే అవకాశం ఉంది. ఈ మేరకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో సెక్యూరిటీ పెంచినట్లు తెలుస్తోంది. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఇటీవల గాంధీభవన్‌లో తన అనుయాయులతో కలిసి టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఛాంబర్ ముందు నిరసన చేపట్టారు. పదవులన్నింటినీ ఆయన తన బంధువులకే అప్పగిస్తున్నారని ఆమె ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయం కాస్తా హైకమాండ్‌కు తెలియటంతో సునీతారావును ఢిల్లీకి పిలిపించి వివరణ తీసుకున్నారు. దీంతో ఆమె.. జరిగిన తప్పిదానికి క్షమాపణలు చెప్పారు.

అలాగే.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఎస్సీల్లో మాదిగ వర్గం శాసనసభ్యులు సైతం కేబినెట్‌లో అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ మేరకు పార్టీలోని అన్ని స్థాయిల్లో వినతిపత్రాలు ఇచ్చారు. మాల సామాజికవర్గం నుంచి ఎమ్మెల్యే వివేక్ కూడా మినిస్టర్ పోస్టు ఆశిస్తున్నారు. ఆయనకు ఛాన్స్ ఇవ్వకపోతే సీరియస్‌ అయ్యే ఛాన్స్ ఉంది. ఇటీవల సరస్వతి నదీ పుష్కరాలకు వివేక్ కుమారుడు వంశీకి ఆహ్వానం అందలేదంటూ ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో కూడా ఆందోళన చేపట్టారు. అన్ని పదవులూ వివేక్ కుటుంబానికే ఇస్తారా అంటూ అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఇటీవల ఫైర్ అయ్యారు. ఈ పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని గాంధీభవన్‌కు సెక్యూరిటీ పెంచినట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News