కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అంతర్గత ఒప్పందాలు
నమ్ముకున్న కాంగ్రెస్ నాయకులకు వెన్నుపోటు
ఇల్లందు, డిసెంబర్ 9(ఆదాబ్ హైదరాబాద్): ఇల్లందు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల (Loacl Body Elections) సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ (Congress, BRS Parties) మధ్య రహస్య ఒప్పందాలు (Secret Agreements) కుదిరాయి. పోటీ పడుతున్నట్లు బయటికి కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం ఆ రెండు పార్టీల ఒక అవగాహన(Understandig)కు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్ (Sarpanch) పదవి, బీఆర్ఎస్ పార్టీకి ఉపసర్పంచ్ (Vice Sarpanch) పదవులు ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది. మిగతా పంచాయతీల్లో ఒప్పందాలు కుదరకపోవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ ఉండటంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
ఇల్లందు మండలంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నా.. ఒప్పందం వల్ల అభ్యర్థులు నష్టపోతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. మండలంలో కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలో పార్టీ అధినాయకులు మోసం చేశారంటూ పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా నాయకులు కృషి చేస్తున్నా.. అంతర్గత ఒప్పందాలతో నమ్ముకున్న నాయకులకు నష్టం వాటిల్లుతోందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి కృషి చేయాల్సిన నేతలు ఎన్నికల సమయంలో లోపాయికారీ ఒప్పందాలతో పార్టీని, పార్టీ అభ్యర్థులను మోసం చేస్తున్నారంటూ స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
