పుస్తకం.. విజ్ఞాన భాండాగారం. హస్తభూషణమే కాదు.. మస్తిష్క (Brain) వికాస సాధనం కూడా. సరస్వతి (Saraswathi) కొలువైన దేవాలయం (Temple) గ్రంథాలయం. విజ్ఞాన సమపార్జనకు మూలసూత్రం.. పుస్తక పఠనం(Book Reading). జ్ఞాన వితరణ మాధ్యమం గ్రంథం. పుస్తకాన్ని నమ్మినవాడు మహాజ్ఞాని అవుతాడు. పుస్తకాన్ని, గ్రంథాలయాన్ని వ్యతిరేకించినవాడు అపర అజ్ఞాని అవుతాడు. ఒక పుస్తకం వేల మెదళ్లను వెలిగించే జ్ఞానదీపం. గ్రంథాలయ దర్శనంతో మనో విస్తృతి విస్తరిస్తుంది. గ్రంథాలయ ప్రాధాన్యాన్ని గుర్తించిన అయ్యంకి వెంకట రమణయ్య (1890-1979) ప్రేరణతో 1968 నుంచి ఏటా నవంబర్ 14-20 తేదీల్లో దేశవ్యాప్తంగా ‘జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు’ (National Library Week Celebrations) నిర్వహించటం ఆనవాయితీగా మారింది.
భారత్ గ్రంథాలయ పితామహుడు ఎస్.ఆర్.రంగనాథన్(S.R.Ranganathan) పేరు కూడా ప్రస్తావించడం సముచితంగా ఉంటుంది. స్వతంత్ర భారత తొలి ప్రధాని చాచా నెహ్రూ (Nehru) జన్మదినం నవంబర్ 14న ప్రారంభమై 20 వరకు ‘జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు’ను నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖ గ్రంథాలయాల జాబితాలో కలకత్తా జాతీయ లైబ్రరీ, ఢిల్లీ పబ్లిక్ లైబ్రరీ, సరస్వతీ మహల్, చెన్నై అన్నా సెంటినరీ లైబ్రరీ, గోవా కృష్ణదాస్ షమా కేంద్రీయ లైబ్రరీ, అలహాబాద్ పబ్లిక్ లైబ్రరీ, తిరువనంతపురం స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, హైదరాబాదు స్టేట్ సెంట్రల్ లైబ్రరీ లాంటివి చోటు దక్కించుకున్నాయి.
లుక్ కల్చర్ (Look Culture) వద్దు.. బుక్ కల్చరే (Book Culture) ముద్దు..
అంతర్జాల (Internet) వలలో విశ్వమే కుగ్రామం అయింది. అరచేతిలో స్మార్ట్ వైకుంఠం తిష్ట వేసింది. గూగులమ్మ ఒడిలో పుస్తకాలు దాక్కుంటున్నాయి. బుక్ కల్చర్ మాయమై లుక్ కల్చర్ ప్రత్యక్షం అయింది. గ్రంథాలయాలు అనాథలు అయిపోతున్నాయి. పుస్తకాలు నిరాదరణతో చిన్నబోతున్నాయి. చందమామ కథలు, బాలమిత్ర చతురతలు అంతరించాయి. యువత.. బామ్మ ఒడికి దూరమై గూగులమ్మ పంచన చేరుతున్నారు. పిల్లలతోపాటు పెద్దలు కూడా పుస్తక పఠనాన్ని త్యాగం చేసి చరవాణి/ల్యాప్‌టాప్/ట్యాబ్‌లతో స్నేహం చేస్తున్న విచిత్ర ఏఐ యుగం నడుస్తోంది.
విశ్వ మానవాళిని పుస్తక పఠనం వైపు ఆకర్షించడానికి, గ్రంథాలయాల ప్రాధాన్యాలను ఏకరువు పెట్టడానికి గ్రంథాలయ వారోత్సవాలను వైభవంగా నిర్వహించడం సముచితంగా ఉంది. ఈ వారోత్సవాల్లో భాగంగా పుస్తక పఠన ప్రయోజనాలు, రచయితలను గుర్తించడం, పుస్తక పఠనాన్ని నమ్మి ఉన్నత స్థితులకు ఎదిగిన మేధావులను సన్మానించుకోవడం, పుస్తక పఠనమే ప్రధాన అంశంగా విద్యాలయాల్లో పోటీలను నిర్వహించడం, పుస్తకాల విక్రయశాలల సందర్శన, పుస్తక ప్రదర్శనల నిర్వహణ, పుస్తకాలు కొని వ్యక్తిగత లైబ్రరీలను నెలకొల్పడం, పిల్లల చేత నీతి కథల పుస్తకాలను చదివించడం, పఠనాసక్తి కలిగిన యువతకు ప్రోత్సాహకాలు బహిష్కరించడం లాంటి పలు కార్యక్రమాలను ఈ వారోత్సవాల్లో నిర్వహించొచ్చు.
గ్రంథ పఠన ప్రయోజనాలు
ఒకసారి పుస్తక పఠన సాగర ఈతను ప్రారంభిస్తే విషయ పరిజ్ఞాన తీరాలకు చేరుతూ విజేతలుగా నిలవడానికి ప్రయత్నించాలి. పాఠ్యాంశాలతోపాటు జనరల్ నాలెడ్జ్ పెంచగల ఇతర పుస్తకాలు, మ్యాగజైన్లు, పత్రికలు నిత్యం చదవడం అలవాటు చేసుకోవాలి. పుస్తకాన్ని చదివినవారిని జ్ఞాన సరస్వతి దీవిస్తూ ఉజ్వల భవిష్యత్తు, సమాజ గుర్తింపులను అందజేస్తుంది. పుస్తక పఠన అభిరుచితో ఓపిక, జ్ఞాన సంపన్నత, ఏకాగ్రత, విద్యావంతులుగా ఎదగడం, మేధో వికాసం ఫలించడం సహజంగానే జరుగుతుంది. పుస్తక పఠనం మెదడుకు వ్యాయామంగా పని చేసి చురుకుగా మార్చుతుంది.
పుస్తక ఫలవంతమైన ఓ ఉత్సవంగా వర్దిల్లుతుంది. పఠనం భారం కాదు.. పరమానంద భరితం. పుస్తకాలను ప్రేమించినవారిని ప్రపంచం అక్కున చేర్చుకుంటుంది. పుస్తక పఠనాన్ని బాల్యం నుంచే అలవాటు చేయాలని తల్లితండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించాలి. కత్తికి పదును పెట్టడానికి ఆకురాయి కావాలి. మెదడుకు చురుకుదనం పెంచడానికి పుస్తక పఠనం తోడవ్వాలి. పుస్తక పఠనంతో విషయ పరిజ్ఞానం, పారిభాషిక పదకోశం, ఆత్మవిశ్వాసం, లోక జ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్య వికాసం, జనరల్ నాలెడ్జ్, ఆకర్షణీయ వేతనం, సమాజంలో ఉన్నత స్థానం, కుటుంబ సంక్షేమం/అభివృద్ధి, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి.
నేటి ఆధునిక యువత గ్రంథాలయ సందర్శనం చేస్తూ గ్రంథ పఠన ప్రపంచంలో మునిగి జ్ఞాన సాగరం ఈది ఎవరెస్టు శిఖరమంత ఎదిగి రేపటి విజ్ఞాన వివేకవంతుల సమాజ స్థాపనకు బాటలు వేసి భవిష్యత్తుకు బాధ్యత కలిగిన విజ్ఞానవంతులను దేశానికి అందిద్దాం. పుస్తకాన్ని నిత్య నేస్తంగా అక్కున చేర్చుకుందాం.
(నవంబర్ 14-20: జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా)
- డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి
