తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న రైతు విద్యుత్ పంపిణి సంస్థ (రైతు డిస్కం) నిర్మాణాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మరింత సమగ్రంగా, సుస్థిరంగా తీర్చిదిద్దేందుకు ఈ రోజు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI)లో గురువారం కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రైతు డిస్కం ఉన్నతాధికారులు, ASCI విద్యుత్ విభాగానికి చెందిన నిపుణులు, పాలసీ మరియు నిర్వహణ రంగాలలో అనుభవజ్ఞులు పాల్గొని సంస్థ నిర్మాణానికి సంబంధించిన వ్యూహాత్మక అంశాలపై లోతైన చర్చలు జరిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు, విధానాలు మరియు ఉత్తర్వులకు పూర్తిగా అనుగుణంగా సంస్థ నిర్మాణం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
సమావేశంలో ముఖ్యంగా క్రింది అంశాలపై సమగ్ర చర్చ జరిగింది:
ఆస్తుల విభజన: ప్రస్తుత విద్యుత్ పంపిణి సంస్థల నుంచి రైతు డిస్కంకు బదిలీ చేయాల్సిన ఆస్తుల గుర్తింపు, విలువ నిర్ణయం, మరియు పారదర్శకంగా విభజన చేపట్టే విధానాలపై చర్చించారు. సాంకేతిక, ఆర్థిక పరమైన ప్రభావాలను కూడా సమీక్షించారు.
మానవ వనరుల సమకూర్పు: ఉద్యోగుల కేటాయింపు, నైపుణ్యాల ఆధారంగా విభజన, అవసరమైన సిబ్బంది నియామకం, శిక్షణా కార్యక్రమాలు, మరియు సేవా నిబంధనల రూపకల్పనపై మార్గదర్శకాలు రూపొందించారు.
వినియోగదారుల వ్యవహారాలు: వ్యవసాయ, నీటి పారుదల, వాటర్ వర్క్స్ ఇతర వినియోగదారులను వేరు చేసి రైతు డిస్కంకు అనుసంధానం చేసే ప్రక్రియ, డేటా సమీకరణ, ఖచ్చితమైన వినియోగదారుల డేటాబేస్ తయారీ, సేవల సరళీకరణపై చర్చించారు.
నిర్వహణ విధానం: సంస్థ పరిపాలన నిర్మాణం, ఫీల్డ్ స్థాయి అమలు వ్యవస్థ, సాంకేతిక మద్దతు, మరియు సేవల డెలివరీలో పారదర్శకత, సమర్థత పెంపుపై దృష్టి సారించారు.
గైడ్లైన్స్ & గవర్నెన్స్: సంస్థ కార్యకలాపాలు సక్రమంగా సాగేందుకు అవసరమైన విధాన పత్రాలు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs), మరియు బాధ్యతల విభజనపై స్పష్టత తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా రైతు డిస్కం చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ, ఐఏఎస్ మాట్లాడుతూ, ఆస్తుల విభజన, మానవ వనరుల కేటాయింపు ప్రక్రియలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయడానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. అదేవిధంగా వినియోగదారుల విభజన, డేటా సమీకరణ, ఉద్యోగుల కూర్పు వంటి అన్ని కీలక ప్రక్రియలను సమయపాలనతో పూర్తి చేసి, రాష్ట్ర అవతరణ దినోత్సవం అయిన జూన్ 2 నాటికి రైతు డిస్కం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
ASCI సెంటర్ ఫర్ ఎనర్జీ స్టడీస్ డైరెక్టర్ Prof. రాజకిరణ్ వి బిలోలికర్, రైతు డిస్కం చీఫ్ ఇంజినీర్లు పి ఆనంద్, ఏ కామేష్, శ్రవణ్ కుమార్, సీజీఎం సుధా మాధురి, ASCI అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
