- ప్రశ్నించడం తప్పు కాదు, చట్ట దుర్వినియోగం తప్పు..
- వెల్లడించిన డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు..
- ఆర్‌టీఐ రక్షక్ హ్యూమన్ రైట్స్ సొసైటీ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం..
- విశిష్ట అథిధిగా పాల్గొన్న ఈస్ట్ జోన్ డిప్యూటీ అదనపు డీసీపీ జే. నర్సయ్య
సమాచార హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణాధారమని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు పేర్కొన్నారు. అవినీతి రహిత పరిపాలన సాధనకు ఆర్‌టీఐ చట్టం సమర్థవంతమైన సాధనమని ఆయన అభిప్రాయపడ్డారు. పరిపాలనలో పారదర్శకత పెంపు, అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం బలోపేతం, ప్రజా విశ్వాస స్థిరీకరణకు సమాచార హక్కు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థను ప్రశ్నించడం ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కు అని స్పష్టం చేశారు. ప్రశ్నించడం ప్రజాస్వామ్య బలానికి సూచిక అని, అయితే చట్ట దుర్వినియోగం వ్యవస్థకు హానికరమని హెచ్చరించారు.
మంగళవారం నాడు బాగ్ అంబర్‌పేట్‌లోని భారత్ నగర్ కమ్యూనిటీ హాల్, హైదరాబాద్‌లో నిర్వహించిన ఆర్‌టీఐ రక్షక్ హ్యూమన్ రైట్స్ సొసైటీ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షుడు ఆరుకుల మహేందర్ గౌడ్ సభాధ్యక్షుడిగా వ్యవహరించారు. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న ఈస్ట్ జోన్ డిప్యూటీ అదనపు డీసీపీ జే. నర్సయ్య ప్రసంగిస్తూ, ప్రశ్నించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు.
ఆర్‌టీఐ ద్వారా సమాచారం సేకరణ చట్టబద్ధ ప్రక్రియలో భాగమని తెలిపారు. అయితే చట్ట పరిమితులను అతిక్రమించే చర్యలు చట్టవిరుద్ధంగా పరిగణించబడతాయని స్పష్టం చేశారు. చట్టాన్ని సద్వినియోగం చేయడం పౌరుల బాధ్యత అని, ఆర్‌టీఐ కార్యకర్తలు ప్రజా సమస్యల పరిష్కార దిశగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సమర్థవంతమైన అమలుతో ఆర్‌టీఐ ప్రజా పరిపాలనలో సమతుల్యత, బాధ్యతాభావాన్ని పెంపొందించగలదని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా గౌడ ఉద్యోగుల ప్రొఫెషనల్ అండ్ ఆఫిషియల్ అసోసియేషన్ అధ్యక్షుడు బండి సాయన్న, సామాజిక కార్యకర్తలు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, సుదర్శన్, తారకేశ్వరి, వీరేందర్ గౌడ్, నవీన్ కుమార్, అనిల్ కుమార్, భాను ప్రసాద్, సత్యనారాయణ, నాగ జ్యోతి, అభిషేక్ గౌడ్, నవీన్ తదితరులు అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. సంస్థ గత ఏడాది నిర్వహించిన సేవా కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష నిర్వహించబడగా, భవిష్యత్ కార్యాచరణపై విస్తృత చర్చ జరిగింది. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.
