నిజాం నిరంకుశ పాలన(Nizam’s Rule)కు వ్యతిరేకంగా పోరాడిన ఎందరో యోధులు ఎన్నో ఉద్యమ పంథాలను ఎన్నుకున్నారు. అలాంటివారిలో రావెళ్ల వెంకట రామారావు ఎన్నదగినవారు. పెన్ను, గన్ను ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని, పోరాట స్ఫూర్తిని రగిలించి ఎందరికో దివానిర్దేశం చేశారు. ఆయన తొలితరం కవి(First generation poet). సాయుధ దళ కమాండర్(Armed Forces Commander). తెలంగాణ గర్వించదగ్గ సాయుధ పోరాట యోధుడు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లిలో 1927 జనవరి 31న రైతు కుంటుంబంలో లక్ష్మయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. భూమి కోసం, భుక్తి కోసం, నిజాం రాచరిక పాలనకు చరమగీతం పాడేందుకు, నైజాం దమనకాండ అంతం కోసం తుపాకీ పట్టి దళ కమాండర్‌గా దూసుకువెళ్లారు.
విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు పార్టీ (Communitst Party) పట్ల ఆకర్షితుడైన రావెళ్ల.. 1944లో ఆంధ్ర మహాసభ(Andhra Mahasabha)లో చేరారు. 1947 ప్రాంతంలో “నవభారత”, “స్వతంత్ర భారత” పత్రికల్లో నైజాం పాలనను విమర్శిస్తూ అభ్యుదయ జానపద శైలిలో రచనలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో “తొలి దశ కమాండర్”గా పెన్నూ గన్నూ చేతబట్టి బరిలోకి దూకి పీడిత ప్రజల పక్షాన నిలిచి పోరాడారు. రహస్య జీవితం గడుపుతూ పోరాటం నిర్వహించారు. 1948 అక్టోబర్ నుంచి 1952 డిసెంబర్ వరకు గుల్బర్గా, ఔరంగాబాద్, బీడ్, ఢిల్లీ, ఖమ్మం తదితర జైళ్లలో గడిపారు. జైళ్లలో దుస్థితిని మార్చాలని సంకల్పించి 16 రోజులు నిరాహార దీక్ష చేపట్టడం ద్వారా చదవడం, రాయడం వంటి సౌకర్యాన్ని సాధించాడు.
ఢిల్లీ కేంద్ర కారాగారంలో ప్రముఖ కమ్యూనిస్టు నేత ఇంద్రజిత్ గుప్తా, మణిపూర్ మాజీ సీఎం దశరథదేవ్, కేఎన్ సింగ్, బర్దన్, కెప్టెన్ మహ్మద్ తదితరులు రావెళ్లకు సహచరులుగా ఉన్నారు. 1952 డిసెంబర్ 8న జైలు నుంచి విడుదలయ్యారు. నేలకొండపల్లి మండలం బోదులబండలో క్యాంపు నిర్వహణ సమయంలో సైనికుడు జరిపిన కాల్పుల్లో తూటా రావెళ్ల శరీరంలోకి దూసుకెళ్లింది. అయినా.. శక్తినంతటినీ కూడగట్టుకొని ఆయన కాల్పులు సాగించి సైనికులను పలాయనం చిత్తగించేలా చేశారు. “జయశ్రీ” అనే కలం పేరుతో 1947లో తన రచనా వ్యాసంగాన్ని ప్రారంభించి.. తర్వాత.. పురాతన్, క్రిషిక్, తెలంగాణ్యుడు, ఆర్‌విఆర్ పేరుతో ఎన్నో రచనలు చేశారు.
తన ఇంటినే కవితా కుటీరం(Poetry Cottage)గా మలుచుకున్నారు. అనంతరం గోకినేపల్లి కవితా కుటీరంలో నిరాడంబర జీవితం గడుపుతూ రచనలు సాగించారు. రావెళ్ల.. పద్య రచనతోపాటు అనేక వచన రచనలు కూడా చేశారు. తెలుగు, ఉర్దూల్లో అద్భుతంగా రాయడంతోపాటు అనర్గళంగా మాట్లాడేవారు. దాశరథి, ఆరుద్ర, శ్రీశ్రీ తదితర ప్రముఖుల సహచరుడు. పల్లెభారతి, జీవనరాగం, అనలతల్పం, రాగజ్యోతులు, చైతన్య స్రవంతి తదితరాలు ఆయన పేరెన్నికగన్న రచనలు. రావెళ్ల కవితా ఖండికల్లో కొన్ని. మధుర కవి, కర్షక కవి బిరుదులు పొందారు. గురజాడ సాహితీ అవార్డు, దాశరథీ సాహితీ పురస్కారం, జాషువా సాహితీ అవార్డులను అందుకున్నారు.
కలుపు మొక్కలను ఏరేస్తే చేనుకు బలం.. రజాకార్లను తరిమేస్తే తెలంగాణకు వరం”.. అంటూ తెలంగాణవీరులకు కాణాచిగా, తరగని నిధులు, నదులతో రత్నగర్భగా ఉన్న స్థితిని, రజాకార్ల(Razakars)ను తరిమేయాల్సిన అవసరాన్ని పరమాధ్బుతంగా కవిత్వీకరించారు. గ్రామీణ ప్రాంతంలో జీవించిన గొప్ప ప్రజా కవి రావెళ్ల వెంకట రామారావు 2013 డిసెంబర్ 10న గోకినపల్లిలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు.
(డిసెంబర్ 10న రావెళ్ల వెంకట రామారావు వర్ధంతి సందర్భంగా)
- రామకిష్టయ్య సంగనభట్ల
