Tuesday, October 28, 2025
ePaper
Homeజాతీయంపద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి ప్రదీప్తానందపై దుమారం

పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి ప్రదీప్తానందపై దుమారం

తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు

పద్మ శ్రీ అవార్డు గ్రహీత స్వామి ప్రదీప్తానందపై పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. కార్తీక్‌ మహారాజ్‌ గా ప్రసిద్ధి చెందిన స్వామి ప్రదీప్తానంద తనపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. తనకు పాఠశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2013 నుంచి పలుమార్లు తనపై కార్తీక్‌ మహారాజ్‌ అత్యాచారం చేశాడని వెల్లడించింది. ఈ ఏడాది కేంద్రం బహూకరించిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలలో మహారాజ్‌ ఒకరు. ఆయనపై ఇలాంటి ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. పశ్చిమబెంగాల్‌ లోని ముర్షిదాబాద్‌ జిల్లాలోని భారత్‌ సేవాశ్రమ్‌ సంఘ బెల్దంగా యూనిట్‌ బాధ్యతలను కార్తీక్‌ మహారాజ్‌ నిర్వర్తిస్తున్నారు. ఆయనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆశ్రమంలోని పాఠశాలల్లో ఒకటైన చాణక్‌ ఆదివాసీ అబాసిక్‌ బాలికా విద్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని మహారాజ్ హామీ ఇచ్చారని, 2013 జనవరిలో తనకు పాఠశాల హాస్టల్‌లో వసతి కూడా కల్పించారని పేర్కొంది. త్వరలోనే ఉద్యోగం కూడా ఇప్పిస్తానని హామీ ఇచ్చి తనపై లైంగిక దాడులకు పాల్పడ్డారని ఆరోపించింది.

ప్రతిరోజు తనను ఆశ్రమం ఆవరణలో ఉన్న బిల్డింగ్‌ ఐదో అంతస్థులోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడని ఫిర్యాదులో పేర్కొంది. లైంగిక దాడి కారణంగా 2013లోనే తాను గర్భవతి నయ్యానని, పాఠశాల సిబ్బందితో కలిసి కార్తీక్‌ మహారాజ్‌ తనను ఓ నర్సింగ్‌ హోమ్‌కు తీసుకెళ్లి బలవంతంగా గర్భస్రావం చేయించాడని బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత తనను ఉద్యోగంలోకి తీసుకోకుండా బయటకు పంపేశారని తెలిపింది. ఆ తర్వాత ఆశ్రమం నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి తనను ఓ వాహనంలో ఎక్కించుకుని బెదిరించారని, మళ్లీ కార్తీక్‌ మహారాజ్‌తో మాట్లాడే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారని బాధితురాలు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. కాగా, బాధితురాలు చేసిన ఆరోపణలను కార్తీక్‌ మహారాజ్‌ ఖండించారు. ఇది తన పేరును, కీర్తిని కించపరచడానికి జరిగిన కుట్ర అని, కాలం అన్నింటికీ సమాధానం చెబుతుందని అన్నారు. తమ ఆశ్రమంలో ఎంతో మంది మహిళలు ఉన్నారని, వారందరినీ తాము తల్లులుగానే భావించి గౌరవిస్తామని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News