- టార్గెట్ బాల్ సీనియర్ నేషనల్స్‌కు ఎంపికైన రాంపల్లి మధు
జవహర్ నగర్ వైఎస్ఆర్ నగర్‌కు చెందిన యువ క్రీడాకారుడు రాంపల్లి మధు టార్గెట్ బాల్ సీనియర్ నేషనల్స్‌కు ఎంపిక కావడం స్థానికంగా గర్వకారణంగా నిలిచింది. పేద కుటుంబంలో జన్మించిన మధు చిన్ననాటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకొని కష్టపాటు, పట్టుదలతో జాతీయ స్థాయికి ఎదిగి యువతకు ఆదర్శంగా నిలిచాడు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ క్రీడలపై ఉన్న అభిరుచి, నిరంతర శ్రమతో ముందుకు సాగుతూ రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ చాటుకున్నాడు.
ఈ సంవత్సరం రెండోసారి సీనియర్ నేషనల్స్‌కు ఎంపిక కావడం అతని ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. గత జనవరిలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్‌లో నిర్వహించిన డ్యూ బాల్ సీనియర్ నేషనల్స్ పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఆల్ ఇండియా టోర్నమెంట్‌లో పాల్గొని మంచి ప్రదర్శన కనబరిచాడు. తాజాగా ఏప్రిల్ 3 నుంచి 7 వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రాపూర్‌లో జరగనున్న టార్గెట్ బాల్ సీనియర్ నేషనల్స్ పోటీలకు తెలంగాణ రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించి మరోసారి తన ప్రతిభను నిరూపించుకునే అవకాశాన్ని పొందాడు.
క్రీడాకారుడిగానే కాకుండా మధు వాలీబాల్ కోచ్‌గా కూడా సేవలందిస్తూ స్థానిక యువతకు శిక్షణ ఇస్తున్నాడు. అతని శిక్షణలో తయారైన అనేకమంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలలో వివిధ విభాగాలలో పాల్గొని ప్రతిభ చాటుతున్నారు. పేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తన కృషి, పట్టుదలతో జాతీయ స్థాయిలో నిలిచిన మధు విజయంపై స్థానికులు, క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. జవహర్ నగర్ ప్రాంతానికి చెందిన యువ క్రీడాకారుడు జాతీయ స్థాయికి ఎంపిక కావడం ప్రాంత ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది.
