Tuesday, February 10, 2026
Homeఆరోగ్యంVaccines | మన ఆరోగ్యానికి రక్షణ కవచాలు

Vaccines | మన ఆరోగ్యానికి రక్షణ కవచాలు

ఇమ్యూనైజేషన్ (Immunization) అనేది శరీరంలోని రోగ నిరోధక శక్తి(Immunity)ని పెంపొందించే శాస్త్రీయ విధానం. టీకాలు మానవ ఆరోగ్యానికి రక్షణ కల్పించే అత్యంత కీలకమైన వైద్య ఆవిష్కరణలు(Medical discoveries). ఇవి కోట్లాది ప్రాణాలను రక్షించడమే కాకుండా ప్రపంచ వ్యాధి భారాన్ని గణనీయంగా తగ్గించాయి.

1796లో ఎడ్వర్డ్ జెన్నర్.. స్మాల్ పాక్స్ (Small Pox) టీకా ఆవిష్కరణతో వైద్య చరిత్ర కొత్త దశను ప్రారంభించింది. ఆ తర్వాత లూయీ పాశ్చర్ రేబిస్ టీకా, జోనస్ సాల్క్ పోలియో (Polio) టీకా రూపొందించడం ద్వారా టీకా శాస్త్రం వేగంగా అభివృద్ధి చెందింది. 1974లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రారంభించిన ప్రోగ్రామ్ ఆన్ ఇమ్మ్యూనైజేషన్ (EPI) ప్రపంచంలోని ప్రతి శిశువుకూ ఉచిత టీకా అందేలా మార్గం సుగమం చేసింది. ఈ శాస్త్రీయ విప్లవం వల్ల స్మాల్ పాక్స్ (మశూచి) ప్రపంచం నుంచి పూర్తిగా నిర్మూలించబడింది. పోలియో దాదాపు అంతరించిపోయింది. ఇవి మానవజాతి సాధించిన అద్భుత విజయాలు.

- Advertisement -

2020లో ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్-19 (Covid) మహమ్మారి.. టీకాల పరిశోధనలో అత్యంత వేగవంతమైన మార్పును తెచ్చింది. కేవలం ఒక సంవత్సరంలోనే ఫైజర్, మోడరన్, ఆస్ట్రేజన్‌కా, భారత్ బయోటెక్ వంటి సంస్థలు సురక్షితమైన టీకాలను అభివృద్ధి చేశాయి. టీకాలు ప్రధానంగా టాక్సాయిడ్, వైరల్ వెక్టార్, కాంజుగేటెడ్, ప్రొటీన్ ఆధారితమైనవిగా ఉంటాయి. ముఖ్యంగా ఎమ్మార్ఎన్ ఏ (mRNA) టెక్నాలజీ ఆధారంగా తయారైన టీకాలు వైద్య శాస్త్రంలో కొత్త యుగానికి నాంది పలికాయి. WHO, GAVI, COVAX వంటి అంతర్జాతీయ సంస్థలు పేద దేశాలకు టీకాలు అందించడంలో కీలక పాత్ర పోషించాయి. కోట్లాది మంది ప్రాణాలు రక్షించబడ్డాయి. అయితే.. టీకా పంపిణీలో ధనిక దేశాలు ముందంజలో ఉండగా పేద దేశాలు వెనకబడ్డాయి. ఈ అసమానత ప్రపంచ ఆరోగ్య సమానత్వం అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.

టీకా తయారీ ఒక క్రమబద్ధమైన శాస్త్రీయ ప్రక్రియ. మొదట వైరస్ లేదా బ్యాక్టీరియా భాగాన్ని (యాంటిజెన్) గుర్తించి, ప్రయోగశాలలో నమూనాలు తయారుచేస్తారు. ప్రీ-క్లినికల్ దశలో జంతువులపై పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాత మానవులపై మూడు క్లినికల్ దశలు (ఫేజ్ I, II, III) నిర్వహిస్తారు. ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నప్పుడు ప్రభుత్వ అనుమతితో టీకా విడుదలవుతుంది.

టీకా శరీరంలోకి చేరినప్పుడు అది వ్యాధి కారకాన్ని అనుకరించేలా పనిచేస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని విదేశీ పదార్థంగా గుర్తించి ప్రతిరక్ష కణాలు (ఏంటిబాడీస్) తయారు చేస్తుంది. బి-కణాలు, టి-కణాలు, మెమరీ సెల్స్ కలిసి భవిష్యత్తులో అదే వైరస్ దాడి చేసినప్పుడు శరీరాన్ని వేగంగా రక్షిస్తాయి. ఫలితంగా వ్యాధి రాకముందే నిరోధక శక్తి ఏర్పడుతుంది. కొన్ని టీకాలు దీర్ఘకాల రక్షణ ఇస్తే, కొన్ని నిర్దిష్ట కాలానికి బూస్టర్ మోతాదులు అవసరం అవుతాయి

ప్రస్తుతం డెంగీ, నిపా, జికా, మంకీపాక్స్ వంటి వైరల్ వ్యాధులు మళ్లీ ముప్పుగా మారుతున్నాయి. వాతావరణ మార్పులు, కాలుష్యం, గ్లోబల్ మైగ్రేషన్ కారణంగా కొత్త వైరస్‌లు సులభంగా వ్యాపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 7 మిలియన్ మంది గాలి కాలుష్యం వల్ల మరణిస్తున్నారు. ఇది రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తోంది.

ఈ నేపథ్యంలో టీకాలు, పర్యావరణ సంరక్షణ రెండూ మానవ ఆరోగ్యానికి అత్యంత కీలకం. ప్రభుత్వాలు ఆరోగ్య రంగానికి తగిన నిధులు కేటాయించి, పేద ప్రజలకు ఉచిత టీకాలు అందించాలి. శాస్త్రవేత్తలు AI ఆధారిత టెక్నాలజీ ద్వారా వైరస్ గుర్తింపు మరియు నూతన టీకా సాంకేతికతలు అభివృద్ధి చేయాలి. ప్రతి పౌరుడు సమయానికి టీకాలు తీసుకోవడం, ఆరోగ్య నియమాలు పాటించడం, మరియు ప్రజా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సమాజ ఆరోగ్య రక్షణలో భాగస్వామి కావాలి.విజ్ఞాన శాస్త్రం మనకు ఆయుధం వంటిది.

టీకాలు కేవలం వైద్య ఆవిష్కరణలు కావు

అవి మానవజాతి రక్షణకు శాస్త్రం అందించిన శాశ్వత కవచం. శాస్త్రవేత్తల కృషి, ప్రభుత్వ విధానాలు, ప్రజల అవగాహన, సహకారం కలిసినప్పుడే ప్రపంచం ఆరోగ్యకరమైన భవిష్యత్తు వైపు అడుగులు వేయగలదు.

  • వెంకటరమణ గిలకత్తుల
- Advertisement -
RELATED ARTICLES

Latest News