దేశ భద్రత విషయంలో రాజీ పడేది లేదు : ప్రధాని మోడీ
- ‘ఆపరేషన్ సిందూర్’ ప్రతి భారతీయుడికి గర్వకారణం
- మహా కుంభమేళాను చూసి ఆశ్చర్యపోయిన ప్రపంచం
- అంతరిక్షయానంతో శుభాంశు శుక్లా దేశకీర్తిని మరింత పెంచారు
- క్రీడల్లో భారత్ ఈ ఏడాది మంచి విజయాలు సాధించింది
- దేశంలో చీతాల సంఖ్య 30కి పైగా పెరగడం సంతోషకరమైన విషయం
- మన్ కీ బాత్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
- 2025వ సంవత్సరంలో భారతదేశ విజయాల్ని గుర్తుచేసుకున్న ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. ఈ ఏడాది భారత్ ఎన్నో ఘన విజయాలు సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ముఖ్యంగా ‘ఆపరేషన్ సిందూర్’ ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలిచిందని, నేటి భారత్ తన భద్రత విషయంలో రాజీ పడబోదని ప్రపంచానికి స్పష్టం చేసిం దని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజలు స్వదేశీ ఉత్పత్తుల పట్ల కూడా గొప్ప ఉత్సాహాన్ని చూపించారని చెప్పారు. అంతరిక్ష యానంతో శుభాంశు శుక్లా దేశకీర్తిని మరింత పెంచారని కొనియాడారు. యువశక్తే భారత ప్రధాన బలమని స్టార్టప్, అగ్రి కల్చర్, ఫిట్‌నెస్ అంశాల్లో యువత ఆవిష్కరణలు బాగున్నాయని ప్రధాని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సరికొత్త టెక్నాలజీ, ఆవిష్కరణలను అందిపుచ్చుకోవాలని మోదీ సూచించారు. క్రీడల్లో భారత్ ఈ ఏడాది మంచి విజయాలు సాధించినట్టు తెలిపారు. నూతన సంకల్పం, లక్ష్యాలతో 2026లోకి వెళ్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. దేశ భద్రత గురించి ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి దీటుగా మే 7న పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో కచ్చితమైన దాడులు చేసింది. మే 10న పాకిస్థాన్‌తో సైనిక ఘర్షణ ముగిసింది. ఆ సమయంలో దేశంలోని నలుమూలల నుంచి ‘మా భారతి’ పట్ల ప్రేమ, భక్తి వెల్లువెత్తింది. ప్రజలు తమదైన రీతిలో సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు.
భారత్ తన భద్రత విషయంలో రాజీపడదని ప్రపంచానికి చాటిచెప్పాం’’ అని మోదీ వివరించారు. అలాగే…‘‘ఈ ఏడాది ప్రారంభంలో ప్రయాగ్ రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా ఒక అద్భుతం. అక్కడికి తరలివచ్చిన కోట్లాదిమంది భక్తులను చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. మన విశ్వాసం, సంస్కృతి, వారసత్వానికి ఇది నిదర్శనం. అలాగే సంవత్సరం చివరలో అయోధ్య రామాలయంలో జరిగిన ‘ధ్వజారోహణ’ కార్యక్రమం ప్రతి భారతీయుడిలో గర్వాన్ని నింపింది. ‘వందేమాతరం’ గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలు చూపించిన ఉత్సాహం అద్భుతం’’ అని ఆయన కొనియాడారు.అంతే కాకుండా 2025లో క్రీడల్లో భారత్ సాధించిన విజయాలను మోదీ గుర్తుచేశారు.
‘‘మన పురుషుల క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా ప్రపంచ కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది. మన అమ్మాయిలు మహిళల బ్లైండ్ టీ20 వరల్డ్ కప్‌లోనూ విజయం సాధించారు. ఆసియా కప్ టి20లో మన జెండా రెపరెపలాడిరది. పారా అథ్లెట్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకాల పంట పండిరచారు’’ అని చెప్పారు. విజ్ఞాన శాస్త్రం, టెక్నాలజీలో భారత్ దూసుకుపోతోందని ప్రధాని అన్నారు. ‘‘అంతరిక్షయానంతో శుభాంశు శుక్లా దేశకీర్తిని మరింత పెంచారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న మొదటి భారతీయుడిగా ఆయన నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సరికొత్త టెక్నాలజీ, ఆవిష్కరణలను మన యువత అందిపుచ్చుకుంటోంది’’ అని ప్రధాని మెచ్చుకున్నారు.
దేశ ప్రజలు ‘స్వదేశీ’ ఉత్పత్తుల పట్ల గొప్ప ఉత్సాహాన్ని చూపించారని మోదీ చెప్పారు. ‘‘భారతీయుల చెమట, మన మట్టి వాసన ఉన్న వస్తువులనే ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. యువశక్తే భారత ప్రధాన బలం స్టార్టప్, అగ్రికల్చర్, ఫిట్‌నెస్ అంశాల్లో యువత ఆవిష్కరణలు చాలా బాగున్నాయి. ప్రపంచం భారత్ వైపు ఎంతో ఆశతో చూస్తోందంటే దానికి కారణం మన యువతే’’ అని మోదీ స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణలోనూ మనం ముందున్నామని ప్రధాని తెలిపారు. ‘‘దేశంలో చీతాల సంఖ్య 2025 నాటికి 30కి పైగా పెరగడం సంతోషకరమైన విషయం. ఈ ఏడాది కొన్ని చోట్ల ప్రకృతి వైపరీత్యాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా మనం ధైర్యంగా నిలబడ్డాం. 2025 మనకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఇప్పుడు నూతన సంకల్పం, కొత్త లక్ష్యాలతో 2026లోకి అడుగుపెడుతున్నాం’’ అని ప్రధాని మోదీ అన్నారు.
