Tuesday, February 10, 2026
Homeసాహిత్యంPrakash Raj | ప్రాంతీయ భాషలను దెబ్బతీస్తే ఊరుకోం

Prakash Raj | ప్రాంతీయ భాషలను దెబ్బతీస్తే ఊరుకోం

సినీ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాష్ రాజ్ హెచ్చరిక

ప్రాంతీయ భాషలను దెబ్బతీస్తే ఊరుకోబోమని సినీ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాష్ రాజ్ హెచ్చరించారు. దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారని, ఇది సరికాదని హితవు పలికారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ కళల విభాగం ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘దక్షిణ భారత భాషలు: గుర్తింపు మరియు రాజకీయాలు’ అనే అంశంపై ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో ప్రకాష్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృ భాషపై ప్రతి ఒక్కరికీ మమకారం ఉంటుందని తెలిపారు.

- Advertisement -

‘నీ భాషపై పట్టు సాధించు. ఇతర భాషలను గౌరవించు. అంతేగానీ.. పరాయి భాషను ఇతరులపై రుద్దే ప్రయత్నం మంచిది కాదు. దక్షణాది రాష్ట్రాల ప్రాంతీయ భాషలపై దాడి జరుగుతోంది. దీంతో.. భాషను కాపాడుకోవడానికి దక్షిణాది రాష్ట్రాల్లో సదస్సులు, సమావేశాలు విరివిగా జరుగుతున్నాయి. నా మాతృ భాష కన్నడ. కానీ.. నేను తెలుగు సహా 7 భాషలు మాట్లాడతాను. తెలుగు ఎందుకు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నానంటే.. నాకు నా మాతృ భాషతోపాటు ఇతర భాషలపై అభిమానం, గౌరవం ఉంది. ఆ భాషలను నేను గౌరవిస్తా. మన దేశంలో చాలా భాషలు, ప్రాంతాలు, మతాలు ఉన్నా ఐకమత్యం ఉంది. కొందరు మాత్రం మాదే పురాతన భాష అని, మేమే గొప్ప అని భావించటం వల్ల ఇతర భాషలను చిన్నచూపు చూస్తున్నారు.

ఉత్తర భారతదేశంలో చాలా రాష్ట్రాల వారికి హిందీ మాత్రమే వచ్చు. ఇతర భాషలు రావు. దీంతో.. వాళ్లు దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి సంపాదించుకోవడానికి వచ్చి మా భాషను, సంస్కృతిని దెబ్బతీయాలని చూస్తే ఉపేక్షించేది లేదు. అమ్మ భాష అనేది మన సంస్కృతి, మన ధ్వని, మన గర్వం, మన గుర్తింపు. దీన్ని ఎవరు దెబ్బతీయాలని చూసినా ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఉనికిని వదలుకోం. మేం మిమ్మల్ని గౌరవిస్తాం. మీరు మమ్మల్ని గౌరవించకపోతే ఎలా గౌరవించాలో కూడా నేర్పుతాం’ అని ప్రకాష్ రాజ్ హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News