మొట్టమొదటి మునిసిపాలిటీ పదవిని చేజిక్కించుకోవడంపై కాంగ్రెస్ కన్ను
కొత్తగా ఏర్పడ్డ ములుగు మునిసిపాలిటీ(Mulugu Municipality)పై ప్రధాన పార్టీల ఆశావహుల అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. 2019 ఫిబ్రవరి 17న ములుగు జిల్లా ఏర్పాటు కాగా ఇన్నేళ్లు జిల్లా కేంద్రంగా, నగర పంచాయతీగా ఉన్న ఏకైక స్థానం ములుగుగానే కొనసాగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka).. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగా 2025 ఏప్రిల్ 5న ములుగు పట్టణంతోపాటు బండారుపల్లి, జీవంతరావుపల్లి జీపీలు కలిపి కొత్త మునిపాలిటీగా అవతరించింది. ములుగు మునిసిపల్ స్థానానికి కూడా త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరగనుండగా కొత్త మునిసిపాలిటీ అయిన ములుగుపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే రిజర్వేషన్ స్థానాలను కూడా అత్యధికంగా బీసీలకు, మహిళలకు, జనరల్ అభ్యర్థులకు కేటాయించారు.
20 స్థానాల్లో 15 స్థానాలకు చైర్ పర్సన్ ఛాన్స్
రాష్ట్రంలోని మునిసిపాలిటీ చైర్మన్ల రిజర్వేషన్ ఖరారు కాగా ములుగు స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. మొత్తం 20 వార్డులకు గాను 15 వార్డ్ స్థానాల్లో చైర్ పర్సన్(Chairperson)గా బరిలో నిలిచేందుకు అవకాశాలు ఉన్నాయి. రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియలో ఎస్టీకి 2, ఎస్సీకి 3 స్థానాలు కేటాయించగా బీసీ మహిళలకు 2, బీసీ జనరల్‌కు 3, జనరల్ అభ్యర్థులకు 4, జనరల్ మహిళలకు 6 స్థానాలను కేటాయించారు. దీంతో.. మొత్తం 15 స్థానాల్లో బీసీ మహిళలు పోటీ చేసే అవకాశం ఉండటంతో ఆశావహుల నుంచి గెలుపు గుర్రాల అభ్యర్థుల కోసం ప్రధాన పార్టీల జిల్లా అధిష్టానాలు కసరత్తు చేస్తున్నాయి.
ములుగులో అధికార కాంగ్రెస్‌తోపాటు బీఆర్ఎస్, బీజేపీ(BRS and BJP) గెలుపు గుర్రాల కోసం వేట కొనసాగిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మునిసిపాలిటీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనే సంకల్పంతో పావులు కదుపుతుండగా బీఆర్ఎస్ సైతం తమ బలాన్ని నిరూపించుకోవాలని చూస్తోంది. బీజేపీ అన్ని స్థానాల్లో పోటీలో ఉండాలని భావిస్తోంది. ఆయా పార్టీల ఇన్‌ఛార్జ్‌లు ములుగు మునిసిపాలిటీ పరిధిలో సమావేశాలు ఏర్పాటుచేసుకొని బరిలో నిలిచేవారి పేర్లను పరిశీలించి, పేర్లను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. కాగా.. పార్టీల నుంచి టికెట్లు రాని పక్షంలో స్వతంత్రులుగా బరిలో దిగేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. చైర్ పర్సన్ అవకాశం ఉన్న వార్డు స్థానాల్లో ఒక్కో స్థానానికి 10 మందికి పైగా బరిలో నిలిచే అవకాశం ఉంది. గట్టి పోటీ నెలకొంది.
భారీగా అంచనాలు
కొత్త మునిసిపాలిటీ అయిన ములుగు.. జిల్లా కేంద్రం కావడంతో వార్డు స్థానాలతోపాటు చైర్ పర్సన్ పీఠం దక్కించుకునేందుకు వెనకాడేది లేదంటూ సవాళ్లు విసురుతున్నారు. అంచనాలు పెరుగుతుండటంతో అధికార పార్టీ నేతలు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు, ఎంత ఖర్చయినా వెనకాడేది లేదనే సంకేతాలు ఇస్తున్నారు. ఇందుకోసం మద్దతుదారులను పోగేస్తున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్, బీజేపీ గట్టిపోటీ ఇచ్చి కొన్ని స్థానాలనైనా దక్కించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే.. మునిసిపాలిటీ పీఠం, వార్డు స్థానాల టిక్కెట్ల కోసం మంత్రి సీతక్క ఆశీస్సులు ఎవరికి ఉండనున్నాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికార పార్టీ అత్యధిక స్థానాల గెలుపు కోసం ఇన్‌ఛార్జ్‌లను కూడా నియమించిన విషయం తెలిసిందే. అభ్యర్థులను స్క్రూటినీ చేసి గెలుపు గుర్రాల ఎంపికలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా ములుగు మునిసిపాలిటీని క్లీన్ స్వీప్ చేసే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ గట్టిగా పావులు కదుపుతున్నాయి.
