– పోలీసుల విధులపై ప్రత్యక్ష అవగాహన
– సైబర్ నేరాల తీరుపై వివరణ
కొత్తపల్లి: పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం (Flag Day) కార్యక్రమాల్లో భాగంగా సోమవారం కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌజ్ (Open House) కార్యక్రమం నిర్వహించారు. చట్టాలపై అవగాహన పెంచేందుకు వివిధ పాఠశాలల విద్యార్థుల(Students)తో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజా రక్షణ, భద్రతకు సంబందించిన పోలీసు చట్టాల (Police Acts) గురించి సమగ్రంగా వివరించారు. అలాగే పోలీసు విధులు, షీ టీమ్స్(She Teams), భరోసా సెంటర్ల (Bharosa Centers) ద్వారా అందిస్తున్న సేవల గురించి అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలు (Road Accidents), స్పీడ్ లేజర్ గన్ల (Speed laser guns) ఏర్పాటు, ట్రాఫిక్ నిబంధనలు (Traffic Rules), సైబర్ నేరాల గురించి విద్యార్థులకు వివరించారు. సైబర్ నేరాల కట్టడికి, సైబర్ క్రిమినల్స్ ను పట్టుకునేందుకు పోలీసు విభాగం సాంకేతికతను అందిపుచ్చుకొని తీసుకుంటున్న చొరవ గురించి తెలిపారు. సైబర్ నేరం జరగ్గానే 1930 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని చెప్పారు. షీ టీమ్స్, భరోసా కేంద్రాల నిర్వహణ, గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు తెలిపారు.

ఈ సందర్భంగా కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ అమర వీరుల త్యాగాల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఓపెన్ హౌజ్ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. నేరస్థులను పట్టుకోవడానికే కాకుండా పోలీసులు సమాజంలో శాంతి భద్రతలు పరిరక్షించడంలో తలమునకలు అవుతారన్నారు. ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని వివరించారు. పోలీస్ వ్యవస్థపై ప్రతిఒక్కరికీ అవగాహన కలిగి ఉండాలన్న ఉద్ధేశ్యంతోనే ఓపెన్ హౌజ్ ప్రోగ్రాం చేపట్టామన్నారు. సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు పోలీసులు చేస్తున్న శ్రమ అంతా ఇంతా కాదన్నారు. విద్యార్థులకు ప్రజల రక్షణ, భద్రత, మహిళ భద్రత, నేరాల నియంత్రణ నేరస్థుల పట్టుకోవడం కోసం పోలీసులు చేస్తున్న విధుల గురించి సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ బృందం ఎస్ఐ నరేష్ కుమార్, రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
