- తీవ్ర వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోడీ..
- చరిత్ర పునరావృతం అవుతుందన్న ప్రధాని..
పశ్చిమబెంగాల్ లోని హల్దియాలో ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల క్రితం నందిగ్రామ్‌లో సీఎం మమతాబెనర్జి ఓటమిని గుర్తుచేస్తూ.. ఈసారి పశ్చిమబెంగాల్ రాష్ట్రం అంతటా అదే ఫలితం పునరావృతమవుతుందని చెప్పారు. పశ్చిమబెంగాల్ మార్పును కోరుకుంటోందని, ఈ క్రమంలో బీజేపీ భారీ విజయాన్ని చూస్తామని వ్యాఖ్యానించారు.
నందిగ్రామ్‌లో ఐదేళ్ల క్రితం ఏం జరిగిందో ఇప్పుడు భవానీపూర్‌తోపాటు మొత్తం బెంగాల్‌లోనూ అదే ఫలితం వస్తుందని ప్రధాని జోష్యం చెప్పారు. ఇవి సాధారణ ఎన్నికలు కావని, ఈ ఎన్నికలు అభివృద్ధికి, బెంగాల్ చరిత్రను తిరగరాయడానికి ఎంతగానో తోడ్పడతాయని అన్నారు. భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ టీఎంసీ ప్రభుత్వం బెంగాల్ అభివృద్ధికి అడ్డుపడుతోందని విమర్శించారు. ప్రైవేటు సెక్టార్లలో సామాన్యులను ఉద్యోగాల నుంచి తొలగించి చొరబాటుదారులకు అవకాశం కల్పిస్తోందని ఆరోపించారు.
బీజేపీ అధికారంలోకి రాగానే రాజ్యాంగం ప్రకారం టీఎంసీ చేసిన మోసాలను బయటకు తీస్తామని, బెంగాల్ యువతకు వ్యతిరేకంగా తృణమూల్ చేసిన పాపాలు వందేళ్లు గడిచినా తొలగిపోవని మోదీ వ్యాఖ్యానించారు. ఒక్కసారి డబుల్-ఇంజిన్ సర్కార్ అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ ఇక్కడ అమల్లోకి వస్తాయని చెప్పారు. బెంగాల్ ప్రజలకు ఆరు హామీలు ఇస్తున్నానని అన్నారు. అన్యాయానికి గురైన ఆడబిడ్డల కేసులను తిరగదోడుతామని, అవినీతికి సాయం చేస్తున్న చట్టాలను రూపుమాపుతామని తెలిపారు
