Saturday, February 28, 2026
Homeఆదిలాబాద్Nirmal | ప్రణాళికబద్ధంగా పట్టణాభివృద్ధి

Nirmal | ప్రణాళికబద్ధంగా పట్టణాభివృద్ధి

  • మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత
  • కోతుల సమస్య పరిష్కారానికి వారంలో చర్యలు
  • ప్రత్యేక పాలనలో చేసిన టెండర్లు…
  • పట్టణంలో తైబజార్ వసూలు రద్దు
  • శివారు కాలనీలపై ప్రత్యేక దృష్టి
  • పార్కుల ఏర్పాటు, ప్రదేశాల అభివృద్ధి
  • “మీట్ ది ప్రెస్”లో నిర్మల్ మున్సిపల్ చైర్ పర్సన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి

చారిత్రక నేపథ్యం కలిగిన నిర్మల్ పట్టణాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని, ఇందుకు పట్టణవాసుల సహకారం ఉండాలని నూతన మున్సిపల్ చైర్ పర్సన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం “మీట్ ది ప్రెస్” నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని సమస్యలపై తీసుకునే చర్యలు, అభివృద్ధి, ఆదాయ మార్గాలు తదితర అంశాలపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానమిచ్చారు.

“ప్రత్యేక”టెండర్లు, తైబజార్ రద్దు……

- Advertisement -

ప్రత్యేక అధికారుల పాలనలో చేసిన టెండర్లు, ప్రతిపాదనలతో పాటు పట్టణంలో వీధి వ్యాపారుల వద్ద నుంచి చేపట్టిన తైబజార్ వసూళ్లను కూడా పాలకవర్గం రద్దు చేసినట్లు ప్రకటించారు. ప్రజలు, చిరు వ్యాపారులకు ఇబ్బందులు కలిగించేలా చేపట్టిన వసూళ్లను తమ పాలకవర్గం రద్దు చేసినట్లు వివరించారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో రోడ్లు, ఫుట్ పాత్, చౌరస్తాలలో ఇష్టారీతిన ఏర్పాటుచేసిన వీధి వ్యాపారాలు, తోపుడుబండ్ల పైన సరైన పరిష్కార చర్యలు తీసుకుంటామని చెప్పారు. వారికోసం ప్రత్యేకంగా “వెండింగ్ జోన్ల”ను ఏర్పాటు చేస్తామని వారు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటాయించిన రూ 15 కోట్లకు సంబంధించి ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజా ప్రతినిధుల ప్రమేయం లేకుండా స్థానిక సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన లేకుండా టెండర్లను, ప్రతిపాదనలను చేశారని, వాటన్నిటిని రద్దు చేస్తున్నామని వివరించారు. త్వరలోనే క్షేత్రస్థాయిలో పరిశీలించి, తగు ప్రతిపాదనలతో నూతన టెండర్లను వేస్తామని పేర్కొన్నారు.

వారంలో కోతుల సమస్యపై చర్యలు…..

నిర్మల్ పట్టణవాసులను ఇబ్బంది పెడుతున్న కోతుల సమస్యపై వారం రోజుల్లో పరిష్కార చర్యలను ప్రారంభించనున్నట్లు చైర్ పర్సన్ పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకు తమ పాలనా కాలంలో చేపట్టినటువంటి కోతుల సమస్యల కట్టడి, తరలింపు వంటి కార్యక్రమాలను తిరిగి చేపడతామని వివరించారు. పట్టణంలో చాలా వీధులలో కోతులు కుక్కలు, పందులు ప్రధాన సమస్యగా మారాయని వీటిపై తమకు ఎన్నికల ప్రచారంలోనూ ఫిర్యాదులు వచ్చాయని వారు పేర్కొన్నారు. మున్సిపల్ నూతన పాలకవర్గ తొలి సమావేశంలోనూ కోతుల సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు తీర్మానించామని తెలిపారు. ఈ మేరకు వారం రోజుల్లోనే సంబంధిత చర్యలను చేపడతామన్నారు.

ప్రజాసమస్యలు పరిష్కారానికి మార్నింగ్ వాక్….

గతంలో 2014-19 పాలనకాలంలో నిర్మల్ మున్సిపాలిటీలో తాము వార్డులవారీగా మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించామని, వీటి ద్వారా నేరుగా ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు అదే రోజు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పేర్కొన్నారు. ఇప్పుడు కూడా వార్డులలో మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. నామమాత్రంగా కాకుండా మునిసిపల్ అధికారులు స్థానిక కౌన్సిలర్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. దాదాపుగా అదే రోజు సదరు సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపడుతామని చైర్ పర్సన్ తెలిపారు.

శివారు కాలనీలపై ప్రత్యేక దృష్టి……

నిర్మల్ జిల్లాకేంద్రంలో మొత్తం 42వార్డులు ఉండగా, ఇందులో 16 శివారు కాలనీలు ఉన్నట్లు తాము గుర్తించామని వారు పేర్కొన్నారు. ఇవన్నీ కూడా కొత్తగా ఏర్పడినవి కావడంతో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు తదితర మౌలిక వసతులు చాలావరకు లేవని, వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి సదరు సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. ఆయా కాలనీలలో స్థానికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించి, ముందుగా వాటిపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. అలాగే మిగతా కాలనీలలో మౌలిక సదుపాయాలతో పాటు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.

త్వరలోనే ముఖ్యమంత్రి వద్దకు…..

మున్సిపల్ కి సంబంధించి నిధుల కొరత వేధిస్తోందని, ఆదాయం సమకూర్చుకునేలా పన్నుల వసూళ్లను పకడ్బందీగా చేపడతామని చైర్ పర్సన్ తెలిపారు. నిర్మల్ పట్టణ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విన్నవిస్తామని వెల్లడించారు. అలాగే జిల్లా కేంద్రంలో ప్రజలకు ఆహ్లాదం కోసం ప్రత్యేకంగా పార్కులు, చారిత్రక ప్రదేశాల అభివృద్ధి, ఒక మ్యూజియం ఏర్పాటు కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. జిల్లా కేంద్రమైన నిర్మల్లో పెద్ద కార్యక్రమం నిర్వహించడానికి ఒక్క స్టేడియం కూడా లేదని, శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి అసైన్డ్ భూముల్లో అసైనీలతో మాట్లాడి, ఏర్పాటు చేసేలా ప్రత్యేక దృష్టి పెడతామని వెల్లడించారు.

అవినీతి రహితంగా ఉండేలా……

గత పాలకవర్గం హయాంలో మునిసిపల్ పైన అవినీతి ముద్రపడిందని, పలువురు అధికారులు సిబ్బంది ఏసీబీకి పట్టుపడటంపై ఫిర్యాదులు వచ్చాయని వారు తెలిపారు. ఇకనుంచి పురపాలక సంఘం ద్వారా పారదర్శకమైన పాలనతో పాటు, అవినీతి రహితంగా సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నామని వారు వెల్లడించారు. ఎక్కడైనా మున్సిపల్ సిబ్బంది, అధికారులు లంచం అడిగినట్లు తెలిస్తే తమకు నేరుగా ఫిర్యాదు చేయాలని సూచించారు. రిసోర్స్ పర్సన్ ల పైన వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుగుతోందని చెప్పారు. జిల్లా కేంద్రంలోని పాత బస్తీలో గల జౌళినాళా సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకునే దిశగా ప్రయత్నిస్తామన్నారు.

ముంపు నివారణ చర్యలు చేపడతాం……

నిర్మల్ జిల్లాకేంద్రంలో ప్రతి వర్షాకాలం పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నట్లు గుర్తించామన్నారు. ఇలాంటి ప్రాంతాలలో వరద నివారణ చర్యలను ప్రారంభిస్తామని, ముంపునకు గురికాకుండా శాశ్వత పనులు చేపడతామని చైర్ పర్సన్ పేర్కొన్నారు.

ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి……..

నిర్మల్ జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిందని ఈ సమస్యలను పరిష్కరించేందుకు పక్కాగా చర్యలు చేపడతామని మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్లు పేర్కొన్నారు. ప్రధాన రహదారి పైన ఆక్రమణల తొలగింపుతో పాటు, వీధి వ్యాపారులకు, తోపుడుబండ్లకు ప్రత్యేకంగా వెండింగ్ జోన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పాత బస్టాండ్ ఏరియాలో వన్ వే ఏర్పాటు చేయాలన్న సూచనలు వస్తున్నాయని వీటి పైన పరిశీలిస్తామని చెప్పారు.

పోలీసుల సహకారంతో జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ అలాగే ట్రాఫిక్ సమస్యలు లేకుండా తగు చర్యలు చేపడుతామన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు జిల్లాకేంద్రంలోని ప్రధాన రహదారిలో గల డివైడర్లపై ఉన్న కోనోకార్పస్ మొక్కలను తొలగించి, సైకస్ జాతికి చెందిన మొక్కలను నాటుతామని తెలిపారు. ప్రజారోగ్యం పైన ప్రత్యేక దృష్టి పెడతామని, ఫుడ్ ఇన్ స్పెక్టర్ అందుబాటులో ఉండేలా చూస్తామని చెప్పారు.

అలాగే జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం, డిగ్రీ కళాశాల, ధర్మసాగర్ మినీ ట్యాంక్ బండ్ లపై వాకింగ్ ట్రాక్ లు, ఓపెన్ జిమ్ ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. నిర్మల్ ప్రజలందరి సహకారంతో రాష్ట్రంలోనే పట్టణాన్ని ప్రథమ స్థానంలో ఉంచేందుకు ప్రయత్నిస్తామని వారు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News