Monday, March 30, 2026
Homeనల్లగొండVamsidhar Reddy | హద్దులు మీరిన కౌశిక్ రెడ్డి…

Vamsidhar Reddy | హద్దులు మీరిన కౌశిక్ రెడ్డి…

  • సభ నుంచి బహిష్కరణ చేయాలి: మాజీ జడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి

తెలంగాణ శాసనసభలో జరిగిన సంఘటనపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగాలఘణపూర్ మండలంలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో నిర్వహించిన సమావేశంలో మాజీ జడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ, శాసనసభలో సభా వ్యవహారాలను ఉల్లంఘించిన పాడి కౌశిక్ రెడ్డిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కొల్లూరి శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో పాడి కౌశిక్ రెడ్డి అనుచితంగా, అసభ్యకరంగా ప్రవర్తించారని మండిపడ్డారు. చేతులతో బెదిరింపు సంకేతాలు చేస్తూ “కాల్చిపడేస్తా” అన్నట్లుగా వ్యవహరించడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు.

- Advertisement -

దళిత వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి, నాలుగు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్నారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు అనేక కీలక శాఖల్లో మంత్రి గా పనిచేసి నిష్కళంక ప్రతిష్టను సంపాదించుకున్నారని పేర్కొన్నారు. అలాంటి నాయకుడిని నిండు శాసనసభలో అవమానించడం సభా మర్యాదలకు విరుద్ధమని, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కినట్టేనని విమర్శించారు.

కౌశిక్ రెడ్డి రాజకీయ ప్రవర్తనపై తీవ్రంగా స్పందించిన వంశీధర్ రెడ్డి, ఆయన రాజకీయ జీవితం బ్లాక్ మెయిల్ ధోరణులతో నిండిపోయిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలను భావోద్వేగాలకు గురిచేసి ఓట్లు దక్కించుకుని, తరువాత రౌడీ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పోలీసు అధికారులను బెదిరించడం, వ్యాపారులను బెదిరించడం, సొంత పార్టీ నాయకుల నుంచే వ్యతిరేకత ఎదురవడం ఆయన వైఖరికి నిదర్శనమని అన్నారు.

ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే శాసనసభ నుండి బహిష్కరించాలని, కడియం శ్రీహరి గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే హుజురాబాద్ నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల పార్టీకి చెందిన పలువురు నాయకులు పాల్గొని, కౌశిక్ రెడ్డి ప్రవర్తనను ఖండిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News