కరీంనగర్: బోయినపల్లి మండలం విలసాగర్ గ్రామంలో మండల వ్యవసాయాధికారి ప్రణీత, వ్యవసాయ విస్తీర్ణ అధికారి రజిత పంటల నమోదు పరిశీలన లో భాగంగా 15 సర్వే నంబరు లని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భం గా రైతులతో మాట్లాడుతూ వరి కొయ్యలను కాల్చడం వల్ల అనేక ప్రమాదాలు సంభవించడమే కాకుండా ఆస్తి, ప్రాణ నష్టంతో పాటు పర్యావరణ ఆరోగ్యం కూడా దెబ్బ తింటుందని,వరి కొయ్యకాలకు నిప్పుపెడితే భూమి సారాన్ని కోల్పోవడంతో పాటు దిగుబడి తగ్గుతుందని అలాగే ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది, పొలాన్ని కలియ దున్నితేనే పంటకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు.
వరి కొయ్యలకు నిప్పు పెట్టడం వల్ల గాలి, నేల కలుషితమవుతుంది. పంటలకు మేలుచేసే మిత్ర పురుగులు మరణిస్తాయి. వరి కొయ్యలను పొలంలో కలియ దున్నితే సేంద్రియ ఎరువుగా మారుతుంది. ఎకరానికి దాదాపు టన్ను ఎరువు తయారవుతుంది. దున్నే ముందు తప్పనిసరిగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చల్లితే వరికొయ్యలు, గడ్డి మొక్కలు తొందరగా కుళ్లిపోతాయి. మురిగిన కొయ్యలు ఎరువుగా మారడటంతో దిగుబడి పెరుగుతుంది. తద్వారా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించొచ్చని రైతులకు సూచించడం జరిగింది.
వరికొయ్యలను (కొయ్యకాలు) కాల్చడం ద్వారా విపరీతమైన వేడితో భూమి సారాన్ని కోల్పోతుంది. ముఖ్యంగా నత్రజని, ఫాస్ఫరస్ లాంటి పోషక పదార్థాల శాతం తగ్గుతుంది. దిగుబడి పోతుంది. భూమికి పీచు పదార్థంగా ఉపయోగపడే అవశేషాలు కాలిపోతాయి. పంటలకు అవసరమైన ఖనిజ లవణాలు దెబ్బతింటాయని తెలిపారు. అలాగే వ్యవసాయ అధికారి ప్రణీత, వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రీదేవి, రవళి, అనూష రత్నంపేట, దేశాయిపల్లి, బూరుగుపల్లి, మాన్వాడ గ్రామాలలో పంట నమోదు లో భాగంగా అందుబాటులో ఉన్న రైతులకు ఈ విషయం లో అవగాహన కల్పించారు.
