Sunday, October 26, 2025
ePaper
Homeఆదాబ్ ప్రత్యేకంNamishree | నమిశ్రీ మహా మోసానికి అధికారిక ముద్ర

Namishree | నమిశ్రీ మహా మోసానికి అధికారిక ముద్ర

ఆదాబ్ హైదరాబాద్ కథనాలే అక్షర సత్యం..

  • ​అటవీ భూమిలో 625 ఫ్లాట్లు.. ఒక్కోటి కోటిన్నర పైనే!
  • ​రంగురంగుల బ్రోచర్లతో ప్రజలకు కుచ్చుటోపీ..
  • దొంగ పత్రాలతో జాతీయ బ్యాంకులకు వల!
  • ​అబ్దుల్లాపూర్‌మెట్ భూ అక్రమాలపై ఆర్‌డిఓ పోలీసులకు ఫిర్యాదు.
  • ​ఒకే ప్రొసిడింగ్ నెంబర్‌తో నకిలీ పత్రాల సృష్టి..
  • దొంగ డాక్యుమెంట్లతోనే హెచ్ఎండిఏ అనుమతులు.
  • ​నకిలీ పత్రాలపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చెయాల‌ని పోలీసులను ఆదేశించిన రెవెన్యూ
  • ఆర్డిఓ ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పీఎస్‌లో కేసు న‌మోదు

​పత్రికా కథనాలు కేవలం ఆరోపణలు కావని, అవి సమాజ హితం కోరి చేసే పరిశోధనాత్మక వాస్తవాలని మరోసారి రుజువైంది. ‘నమిశ్రీ నిర్మాణ సంస్థ‘(Namishree Infrastructure Projects Pvt. Ltd) (నమిశ్రీ) పేరిట జరుగుతున్న భారీ భూ అక్రమాలపై ‘ఆదాబ్ హైదరాబాద్’ దినపత్రిక చేస్తున్న పోరాటం అక్షర సత్యమని ఇప్పుడు అధికారిక ముద్ర పడింది.

​ఇన్నాళ్లూ కేవలం పత్రికా కథనాలుగానే ఉన్న ఈ వ్యవహారంలో, ఇప్పుడు స్వయంగా ప్రభుత్వ యంత్రాంగమే కదిలింది. విలువైన అటవీ భూమిని కబ్జా చేసి, అందులో సుమారు 625 విలాసవంతమైన యూనిట్లను నిర్మిస్తూ, ఒక్కొక్క యూనిట్ ధర కోటిన్నర పైగానే నిర్ణయించి, రంగురంగుల బ్రోచర్లతో ప్రజలను మోసం చేస్తున్న ‘నమిశ్రీ’ సంస్థ సృష్టించిన నకిలీ పత్రాలను, దొంగ డాక్యుమెంట్లను సాక్షాత్తూ ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ మోసం తీవ్రతకు అద్దం పడుతోంది.

​ఒకే ప్రొసీడింగ్ నెంబర్‌ను ఉపయోగించి, ప్రభుత్వ రికార్డులనే తారుమారు చేసి, ఏకంగా హెచ్‌ఎండీఏ నుండే అనుమతులు పొందారంటే ఈ దందా ఎంత వ్యవస్థీకృతంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ‘ఆదాబ్’ కథనాలను నిజం చేస్తూ, ప్రభుత్వ దర్యాప్తులో వెలుగు చూసిన ఈ సంచలన మోసం పూర్తి వివరాలు…

​’నమిశ్రీ’ నిర్మాణ సంస్థ సికింద్రాబాద్ ఎస్టేట్ భూములు మరియు అబ్దుల్లాపూర్‌మెట్ అటవీ భూముల్లో సాగిస్తున్న అక్రమాలపై వరుస కథనాలను ప్రచురించిన విషయం విదితమే. ముఖ్యంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, తట్టిఅన్నారం గ్రామం సర్వే నెం. 121/పి పేరుతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి హెచ్‌ఎండీఏ అధికారుల నుండి అనుమతులు పొంది, నిర్మాణం మాత్రం పక్కనే ఉన్న విలువైన అటవీ భూమిలో చేపడుతున్నట్లు ఆధారాలతో సహా నిరూపించింది.

​ఇక్కడే ఈ సంస్థ సుమారు 625 విలాసవంతమైన ఫ్లాట్లను నిర్మిస్తూ, ఒక్కో యూనిట్‌ ధర కోటిన్నర పైగానే పలుకుతూ, రంగురంగుల బ్రోచర్లతో అమాయక ప్రజలను మోసం చేస్తోన్న సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమాలపై స్వయంగా ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. ఆర్‌డిఓ కార్యాలయం నుండి అందిన సమాచారం ప్రకారం, నమిశ్రీ నిర్మాణ సంస్థ నకిలీ పత్రాలను సృష్టించింది అక్షరాలా నిజమని తేలింది.

ఆర్‌డిఓ ఫిర్యాదులో ఏముంది?
​ఇబ్రహీంపట్నం ఆర్‌డిఓ కె. అనంత రెడ్డి, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు రాసిన అధికారిక లేఖ (లేఖ.సంఖ్య. హెచ్/1302/2025, తేదీ: 04-06-2025) ప్రకారం, తట్టిఅన్నారం సర్వే నెం. 121 పార్ట్‌కు సంబంధించి ఒకే ప్రొసీడింగ్ నెంబర్‌పై రెండు వేర్వేరు పత్రాలు ఉన్నట్లు తేలింది.

అసలు పత్రం: ప్రొసీడింగ్స్.సంఖ్య. ఎల్‌/898/2017, తేదీ.27-09-2017 ప్రకారం ఎక‌రం 2-35 గుంటల భూమిని సి. అమరేందర్ రెడ్డి తండ్రి నర్సింహా రెడ్డి పేరు మీద జారీ చేసినట్లు ఆర్‌డిఓ కార్యాలయ రికార్డుల్లో ఉంది. ఇది అసలైన పత్రం.

నకిలీ పత్రం: అయితే, ఇదే నెంబర్ (L/898/2017, తేదీ.27-09-2017) ఉపయోగించి, పి.ధర్మవీర్ రెడ్డి తండ్రి పి.అంజి రెడ్డి పేరు మీద 1 ఎక‌రం భూమికి మరో ప్రొసీడింగ్ మోసపూరితంగా సృష్టించబడింది.

మోసం బట్టబయలు
​ఈ రెండవ ప్రొసీడింగ్ (పి.ధర్మవీర్ రెడ్డి పేరు మీద ఉన్నది) తమ కార్యాలయంలో అందుబాటులో లేదని, దీనికి సంబంధించి తహశీల్దార్ కార్యాలయం, అబ్దుల్లాపూర్‌మెట్ నుండి ఎటువంటి ప్రతిపాదన రాలేదని ఆర్‌డిఓ తన లేఖలో స్పష్టం చేశారు. “అందువల్ల సదరు పత్రం నిజమైనది కాదని మరియు నకిలీ పత్రం అని తెలుస్తోంది,” అని ఆర్‌డిఓ తన లేఖలో అధికారికంగా పేర్కొన్నారు.

​అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, ‘ఆదాబ్’ ఆరోపించినట్లుగానే, ఇదే నకిలీ పత్రాన్ని ఉపయోగించి సదరు వ్యక్తి హెచ్ఎండిఏ నుండి కూడా అనుమతి పొందారని ఆర్‌డిఓ తన ఫిర్యాదులో నిర్ధారించారు.

​తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశం
​’ఆదాబ్’ వెలుగులోకి తెచ్చిన ఈ భారీ మోసంపై రెవెన్యూ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ నకిలీ పత్రాల సృష్టిపై సంబంధిత సెక్షన్ల కింద తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును దర్యాప్తు చేయవలసిందిగా ఆర్‌డిఓ అనంత రెడ్డి పోలీసులను ఆదేశించారు. ఈ లేఖ కాపీని రాచకొండ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఇబ్రహీంపట్నం డివిజన్‌కు కూడా పంపారు. ఫిర్యాదు పై వెంటనే పోలీస్ అధికారులు కేసు నమోదు (ఎఫ్ ఐ ఆర్ నెంబర్ 293 / 2025) చేశారు.

​’నమిశ్రీ’ నిర్మాణ సంస్థ అక్రమాలకు ఈ ఆర్‌డిఓ ఫిర్యాదు ఒక బలమైన ఆధారంగా నిలిచింది. ‘ఆదాబ్’ కథనాలు కేవలం ఆరోపణలు కావని, పక్కా ఆధారాలతో కూడినవని మరోసారి రుజువైంది. కేవలం ఒక నకిలీ పత్రం ఆధారంగా హెచ్‌ఎండీఏ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఎలా అనుమతులు మంజూరు చేసిందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

​బ్యాంకుల నుండి కోట్ల రుణాలు.. త్వరలో పూర్తి ఆధారాలతో!
​ఈ వ్యవహారం కేవలం నకిలీ పత్రాలు, అటవీ భూమి కబ్జాతోనే ఆగలేదు. ప్రజలను మోసం చేయడమే కాకుండా, ఇదే దొంగ పత్రాలను జాతీయ బ్యాంకులకు తాకట్టు పెట్టి ‘నమిశ్రీ’ సంస్థ కోట్ల రూపాయల రుణాలు పొందినట్లు ‘ఆదాబ్ హైదరాబాద్’ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఈ భారీ కుంభకోణంపై, భవిష్యత్తులో బ్యాంకులను సైతం బురిడీ కొట్టించే తీరుపై పూర్తి వివరాలతో మరో సంచలనాత్మక కథనం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం!

RELATED ARTICLES
- Advertisment -

Latest News