Tuesday, February 10, 2026
Homeబిజినెస్India | ఖర్చు విషయంలో తగ్గేదేలా

India | ఖర్చు విషయంలో తగ్గేదేలా

2026వ సంవత్సరంలో ఇండియా అత్యంత ఆశావాద వినియోగదారుల మార్కెట్‌(Optimistic Consumer Market)గా ఎదుగుతుందని నువామా సంస్థ నివేదిక(Nuvama Report) వెల్లడించింది. రానున్న ఆరు నెలల్లో దాదాపు 60 శాతం మంది భారతీయులు తమ ఇంటి ఖర్చులను పెంచుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఖర్చు చేయడానికి సుముఖత చూపుతుండటం వినియోగదారుల్లోని విశ్వాసాన్ని, మెరుగైన ఆర్థిక పరిస్థితుల అంచనాలను ప్రతిబింబిస్తోంది. ఖర్చు విషయంలో ఆటోమొబైల్స్(Automobiles) ముందున్నాయి. దాదాపు 70 శాతం మంది వినియోగదారులు ఈ సెక్టార్‌లో అధిక ఖర్చును ప్లాన్ చేస్తున్నారు.

ఆటోమొబైల్స్ తర్వాత మొబైల్ పరికరాలు(Mobile Devices), మొబైల్ ఫోన్ల(Mobile Phones)కు సంబంధించిన ప్రణాళికలు ఉన్నాయి. ఈ రెండు విభాగాల్లో ప్రతి దానిలోనూ ఖర్చు పెరగనున్నట్లు 63 శాతం మంది వినియోగదారులు సూచిస్తున్నారు. భారతీయ వినియోగదారుల్లో దాదాపు మూడింట ఒక వంతు మంది అధిక మొత్తం ఖర్చును ప్లాన్ చేస్తున్నారు. దీర్ఘకాలిక కేటగిరీలో ఇంటి అద్దెలు వంటి వాటికి ఎక్కువ ఖర్చు చేయాలని ఆశిస్తున్నారు. స్నాక్స్, కూల్ డ్రింక్స్ వంటి తరచుగా వినియోగించేవాటికి ఖర్చు చేసే ఉద్దేశం తక్కువగా ఉంది. భారతీయ వినియోగదారులు ఇతర దేశాల కస్టమర్లతో పోల్చితే గణనీయంగా ఎక్కువ ఆశావాదం(Optimistic) చూపుతున్నారు.

- Advertisement -

ఆశావాదంలో ప్రపంచ సగటు.. మైనస్ 12 శాతం కాగా ఇండియాలో ఏకంగా 27 శాతంగా నమోదైంది. చైనా తర్వాత రెండో స్థానంలో ఇండియా నిలిచింది. భారతీయ వినియోగదారుల్లో దాదాపు 61 శాతం మంది భవిష్యత్తులో మంచి రోజులు కొనసాగుతాయని ఆశిస్తుండగా 34 శాతం మంది మాత్రమే నిరుద్యోగం, ఆర్థిక మందగమనాన్ని అంచనా వేస్తున్నారు. ఇటీవలి ప్రపంచ సంఘర్షణలు, రాజకీయ సంఘటనలు భారతదేశ వృద్ధిని మందగిస్తాయని నికరంగా 17 శాతం మంది భారతీయ వినియోగదారులు మాత్రమే భావిస్తున్నారని నివేదిక పేర్కొంది.

వృద్ధి మందగిస్తుందని భయపడేవారి సంఖ్య పరంగా ఇండియా.. చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది. దీనికి విరుద్ధంగా యూకే, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో ఈ సంఖ్య 60 శాతం మించిపోయింది. 69 శాతం మంది భారతీయ వినియోగదారులు వస్తువుల ధరలు పెరుగుతున్న కారణంగా ఎక్కువ ఖర్చు చేయాలని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా ఖర్చు ప్రవర్తనను ప్రభావితం చేస్తున్నాయి. మొత్తమ్మీద ఈ నివేదిక ఇండియా 2026లోకి ప్రవేశిస్తున్న అత్యంత ఆశావాద వినియోగదారు మార్కెట్‌గా తన స్థానాన్ని నొక్కి చెప్పింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News