Tuesday, March 3, 2026
Homeబిజినెస్Budget-2026 | సన్‌డే.. బడ్జెట్ డే..

Budget-2026 | సన్‌డే.. బడ్జెట్ డే..

రేపు పార్లమెంట్‌‌లో కొత్త పద్దు
వరుసగా 9వ సారి ప్రవేశపెడుతున్న సీతమ్మ
భారీగా ఆశలు పెట్టుకున్న మధ్యతరగతి ప్రజలు
రెండు పన్ను విధానాలపై కొనసాగుతున్న ఉత్కంఠ

కేంద్ర ఆర్థిక మంత్రి(Union Finance Minister) నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఆదివారం (ఫిబ్రవరి 1న) కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌(Parliament)లో ప్రవేశపెట్టనున్నారు. వరుసగా 9వ సారి ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటం విశేషం. ఆదివారం బడ్జెట్ రావడం దేశ ఆర్థిక చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలవనుంది. బడ్జెట్‌ 2026 సమీపిస్తున్న నేపథ్యంలో మధ్యతరగతి వర్గాల్లో(Middle Class People) భారీ అంచనాలు నెలకొన్నాయి. బంగారం, వెండి సహా ఇతర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో వాటిని తగ్గించేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఆదాయ పన్ను(Income Tax) విషయంలో మరిన్ని రాయితీలు ఇవ్వాలని ఉద్యోగులు, వ్యాపారులు, పెన్షనర్లు కోరుతున్నారు. గత బడ్జెట్‌లో కొత్త పన్ను విధానానికి ప్రభుత్వం పెద్దఎత్తున ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యంలో ఈసారి కూడా పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు వస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

బడ్జెట్‌ను ఆదివారం ప్రవేశపెట్టనుండటం వల్ల విశ్లేషణకు అదనపు సమయం లభిస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. సోమవారం ట్రేడింగ్ ప్రారంభానికి ముందే ఇన్వెస్టర్లకు స్పష్టత వస్తుందని, ఊగిసలాటలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈసారి బడ్జెట్‌పై మధ్యతరగతి ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం, స్టాండర్డ్ డిడక్షన్‌లో ఊరట కల్పించడం వంటి నిర్ణయాలు ఉంటాయని ట్యాక్స్ పేయర్లు ఆశిస్తున్నారు.

పాత విధానానికి భవిష్యత్ ప్రశ్నార్థకం

బడ్జెట్‌–2025లో కేంద్ర ప్రభుత్వం నూతన పన్ను విధానంలో కీలక మార్పులు చేసి మధ్యతరగతికి ఊరట కల్పించింది. వార్షిక ఆదాయం రూ.12 లక్షల వరకు ఉన్నవారికి పూర్తి స్థాయి పన్ను మినహాయింపు ఇవ్వడంతోపాటు ఉద్యోగుల స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.75 వేలుగా పెంచింది. అలాగే.. సెక్షన్‌ 87A కింద ఇచ్చే రిబేట్‌ను రూ.60 వేల వరకు పెంచడంతో లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులకు ప్రత్యక్ష లాభం చేకూరింది.

అయితే.. ఈ రాయితీలన్నీ ఎక్కువగా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నవారికే పరిమితం కావడం చర్చకు దారితీసింది. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో ఆ విధాన భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ప్రభుత్వం పాత విధానాన్ని పూర్తిగా తొలగిస్తుందా? లేక, కొనసాగిస్తూ కొత్త రాయితీలు ఇస్తుందా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

పాత విధానంలో నిలిచిపోయిన డిడక్షన్లు

గత కొన్నేళ్లుగా సెక్షన్‌ 80C, 80D, హోమ్ లోన్ వడ్డీ మినహాయింపు, NPS వంటి కీలక డిడక్షన్లలో ఎలాంటి పెంపు జరగలేదు. మరో వైపు కొత్త పన్ను విధానంలో వరుసగా రాయితీలు అందుతుండటంతో పాత విధానాన్ని ఎంచుకున్న పన్ను చెల్లింపుదారుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. పన్ను విధానంలో మార్పులతోపాటు ప్రజలు రోజువారీగా ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నారు. ఐటీ రిటర్న్స్‌లో ఆలస్యం, AISలో తప్పులు, TDS సంబంధిత గందరగోళం, అనవసర నోటీసులు వంటి అంశాలు పన్ను చెల్లింపుదారులను ఇబ్బందిపెడుతున్నాయి. వీటికి పరిష్కారం చూపితే పన్ను వ్యవస్థపై ప్రజల నమ్మకం మరింత బలపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

కొత్త పన్ను విధానంలో వృద్ధులకు ప్రత్యేక మినహాయింపులు లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక స్లాబ్స్, అధిక రిబేట్లు, ఆరోగ్య వ్యయాలకు అదనపు డిడక్షన్లు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో ఇది అత్యవసరమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

80C, 80D పరిమితులు పెరుగుతాయా?

మధ్యతరగతి ప్రజలు ప్రధానంగా ఆశిస్తున్న అంశాల్లో సెక్షన్‌ 80C, 80D పరిమితుల పెంపు ముందు వరుసలో ఉంది. ప్రస్తుతం 80C కింద గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే మినహాయింపు లభిస్తోంది. లైఫ్ ఇన్సూరెన్స్, పీఎఫ్, పీపీఎఫ్, ఈఎల్‌ఎస్‌ఎస్, పిల్లల ఫీజులు వంటి పొదుపు పెట్టుబడులు ఇందులో ఉన్నాయి. ఈ పరిమితిని పెంచితే సేవింగ్స్‌కు మరింత ప్రోత్సాహం లభిస్తుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. అలాగే 80D కింద ఆరోగ్య బీమా ప్రీమియంపై ప్రస్తుతం కుటుంబానికి రూ.25 వేల వరకు, సీనియర్ సిటిజన్లకు రూ.50 వేల వరకు డిడక్షన్ ఉంది. అయితే పెరుగుతున్న బీమా ప్రీమియాలు, వైద్య ఖర్చుల నేపథ్యంలో ఈ పరిమితులు సరిపోవడంలేదని ప్రజలు వాపోతున్నారు.

బడ్జెట్‌–2026పై మధ్యతరగతి ఆశలు

బడ్జెట్‌–2026లో స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.75 వేల నుంచి రూ.లక్షకు, పన్ను మినహాయింపు పరిమితిని రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచాలని మధ్యతరగతి వర్గాలు కోరుతున్నాయి. ఇలా చేస్తే ఉద్యోగులు, పెన్షనర్లు EMIలు, ఇంటి ఖర్చులు, పిల్లల విద్య వ్యయాలను సులభంగా నిర్వహించగలరని భావిస్తున్నారు. ఇళ్ల ధరలు, అద్దెలు పెరుగుతున్న నేపథ్యంలో హోమ్ లోన్ వడ్డీపై సెక్షన్‌ 24(b) డిడక్షన్, HRA పరిమితులను సవరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో నివసించేవారికి ఇది పెద్ద ఊరటగా మారనుంది.

కొత్త విధానమేనా? లేక, రెండూ కొనసాగుతాయా?

నిపుణుల అంచనా ప్రకారం.. డిడక్షన్లు తక్కువగా ఉన్నవారికి కొత్త పన్ను విధానం అనుకూలంగా ఉంది. అయితే.. ఇన్సూరెన్స్, హోమ్ లోన్, దీర్ఘకాలిక పొదుపులు ఉన్నవారికి ఇప్పటికీ పాత విధానమే లాభదాయకం. కొత్త విధానంలో కొంతమేర డిడక్షన్లు జోడిస్తే ఈ తేడా తగ్గే అవకాశం ఉంది. మొత్తంగా బడ్జెట్‌–2026లో ప్రభుత్వం పన్ను వ్యవస్థలో సరళత, స్పష్టత, స్థిరత్వంపై దృష్టి పెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాత పన్ను విధానం కొనసాగుతుందా? లేక పూర్తిగా కొత్త విధానానికే ప్రాధాన్యం ఇస్తారా? అనేది ఈ బడ్జెట్‌లో తేలనుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News