- నియోపోలిస్ ప్లాట్ల వేలం.. హెచ్ఎండీఏకు భారీ లాభాలు
- పూర్తయిన నాలుగో విడత వేలం..
- హెచ్ఎండీఏకు రూ.3,862 కోట్ల ఆదాయం
- ఎకరా రూ.77.75 కోట్లు పలికిన గోల్డెన్ మైల్ స్థలం
కోకాపేటలోని నియోపోలిస్ భూసంవ్యవ హారాలలో మరోసారి రికార్డు స్థాయి ఆదాయం నమోదైంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ నిర్వహించిన నాలుగో విడత భూముల వేలం విజయవంతంగా పూర్తయ్యి, మొత్తం రూ.3,862 కోట్ల ఆదాయం అథారిటీ ఖాతాలో చేరింది. ఈసారి 15, 16, 17, 18, 19, 20 నంబర్ల ప్లాట్లు క్రమంగా వేలం బ్లాక్లుగా ప్రకటించగా, రియల్ ఎస్టేట్, కమర్షియల్ రంగ సంస్థలు భారీగా పాల్గొన్నాయి.
నియోపోలిస్కు పెట్టుబడిదారుల్లో ఉన్న భారీ డిమాండ్ ఈ వేలంలో మరో సారి స్పష్టమైంది. వేలం చివరి దశలో ‘గోల్డెన్ మైల్’ పేరుతో గుర్తింపు పొందిన 1.98 ఎకరాల ప్రీమియం ప్లాట్ను సీఓఈయూఎస్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఎకరా ధర రూ.77.75 కోట్లుగా నమోదవడం ఈ రౌండ్కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గత ఏడాదితో పోల్చితే ఈసారి వేలం ద్వారా వచ్చిన ఆదాయం 87 శాతం పెరిగింది. కోకాపేట, నియోపోలిస్ ప్రాంతంలో వాణిజ్య, ఐటీ, విద్యాసంస్థల పెట్టుబడులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఫలితాలు సహజమేనని నిపుణులు భావిస్తున్నారు.
