- ఇంటర్మీడియేట్ బోర్డు కళ్లుగప్పిన దుర్మార్గం..
- రిస్క్ పడ్డ వేలాదిమంది విద్యార్థుల జీవితాలు..
- “నారాయణ ఐఐటి అకాడమీ” అక్రమ విద్యా సామ్రాజ్యం..
- పిల్లల భవిష్యత్తుతో ఆదుకుంటుంటున్న దౌర్భాగ్యం..
- జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు.. తక్షణ చర్యలకు డిమాండ్..
విద్యా సంస్థలు జ్ఞానం పంచె దేవాలయాలు కావాలి.. కానీ ఇక్కడ కాసుల వర్షం కురిపించే కార్ఖానాలుగా మారుతున్నాయి. భాగ్యనగరానికి గుండెకాయ లాంటి హైటెక్ సిటీలో, నిబంధనలను తుంగలో తొక్కి, అనుమతుల ఊసే లేకుండా “నారాయణ ఐఐటీ అకాడమీ” సాగిస్తున్న అక్రమ విద్యా సామ్రాజ్యం ఇప్పుడు బట్టబయలైంది. ఇంటర్మీడియట్ బోర్డు కళ్లుగప్పి, వేల మంది విద్యార్థుల జీవితాలను రిస్క్‌లో పెడుతూ, చట్టాన్నే సవాల్ చేస్తున్న ఈ ‘కార్పొరేట్ మాయాజాలం’పై ఇప్పుడు సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఇది కేవలం విద్యా సంస్థ నిర్వహణ కాదు.. అక్షరాలా ఒక తరం భవిష్యత్తుతో ఆడుకుంటున్న భారీ కుంభకోణం..

అక్రమ విద్యా సామ్రాజ్యంపై ‘నారాయణ’ గురి :
అనుమతులు లేని అకాడమీ.. ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్తు! మాదాపూర్, ఖానామేట్ ప్రాంతంలో, నారాయణా అకాడమీ, హైటెక్స్ – 1, హైటెక్స్ – 2 పేరుతో నడుస్తున్న విద్యాసంస్థలు కార్పొరేట్ ముసుగులో విద్యా వ్యాపారం సాగిస్తున్నారు.. హైటెక్ సిటీ నడిబొడ్డున సాగుతున్న విద్యా సంస్థలు, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలను బేఖాతరు చేస్తూ వేల కోట్ల రూపాయల దందాను కొనసాగిస్తున్నాయి.కొన్ని కాలేజీలకు అనుమతులు శూన్యం.. ఆకర్షణే లక్ష్యంగా సాగిపోతున్నాయి.. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి కనీస అనుమతులు లేకపోయినా, ఈ అకాడమీలు యథేచ్ఛగా ఇంటర్మీడియట్ విద్యను బోధిస్తున్నాయి.
‘ఐఐటీ ఇంటిగ్రేటెడ్ కోర్సులు’ అంటూ రంగుల ప్రపంచాన్ని చూపిస్తూ తల్లిదండ్రులను బుట్టలో వేసుకుంటున్నారు. అయితే అనుమతి లేకుండా విద్యాసంస్థను నడపడం తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ -1982 ప్రకారం నేరం. విద్యార్థులను, తల్లిదం డ్రులను తప్పుదోవ పట్టించడం ఐపీసీ సెక్షన్ 420 (మోసం), 406 (విశ్వాస భంగం) కింద కఠినమైన శిక్షార్హమైన నేరం.
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు ఈ దుర్మార్గులు.. కోచింగ్ సెంటర్ల పేరుతో కాలేజీలను నడపడం ద్వారా విద్యార్థుల సర్టిఫికేట్ల చెల్లుబాటుపై ప్రమాదం పొంచి ఉంది. రేపు పైచదువులకు వెళ్లినప్పుడు లేదా ఉద్యోగ వేటలో ఉన్నప్పుడు ఈ అనధికారిక విద్య విద్యార్థుల పాలిట శాపంగా మారే అవకాశం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. కేవలం కాసుల కక్కుర్తి కోసం ఒక తరాన్ని తప్పుదోవ పట్టించడం అక్షరాలా నేరం కాదా? అంతే కాకుండా విద్యార్ధులపై ఒత్తిడిలు పెంచడం..
ర్యాంకులకోసం అడ్డదారులు తొక్కడం ఈ కాలేజీలకు పరిపాటి అయిపొయింది.. కేవలం ఒకటి, రెండు కాలేజీలకు మాత్రమే అనుమతులు తీసుకోవడం, పదుల సంఖ్యలో కాలేజీలు నడపడం కూడా చేస్తున్నారు.. ప్రభుత్వాన్ని, అధికారులను, నిబంధనలను అసలు పట్టించుకోకపోవడం జరుగుతోంది..ఈ కాలేజీల యాజమాన్యాలు పెట్టే ఒత్తిళ్లకు తట్టుకోలేక ఎంతోమంది అమాయక విద్యార్థులు బలవంతంగా ఉసురు తీసుకున్న సంఘటనలు అనేకం చూసాం.. చూస్తూనే ఉన్నాం.. అయినప్పటికీ మార్పు రాకపోవడం బాధాకరం..

జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు:
ఉక్కుపాదం మోపాల్సిందే :
ఈ అక్రమ విద్యా సామ్రాజ్యంపై జిల్లా కలెక్టర్‌కు అధికారిక ఫిర్యాదు అందింది. అకాడమీ ముసుగులో సాగుతున్న ఈ నకిలీ విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని ఫిర్యాదుదారులు డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్య డిమాండ్లు :
జిల్లా స్థాయి కమిటీతో తక్షణమే లోతైన విచారణ జరిపించాలి. అనుమతులు లేని పక్షంలో సంస్థను తక్షణమే సీజ్ చేసి, విద్యార్థుల విద్యా సంవత్సరాన్ని కాపాడాలి. మోసపూరిత ప్రకటనలతో అడ్మిషన్లు తీసుకున్న యాజ మాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. నిబంధనల ఉల్లంఘనకు గాను భారీ జరిమానాలు విధించాలి. విద్యా వ్యవస్థను వ్యాపారంగా మార్చేసి, చట్టాలను తుంగలో తొక్కే ఏ సంస్థనైనా క్షమించకూడదు. హైటెక్ సిటీ రోడ్డులో సాగుతున్న ఈ ‘నారాయణ’ అక్రమాలకు చట్టం సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.
అధికారులు మేల్కోకపోతే వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిపోయే ప్రమాదం ఉంది.ముఖ్యంగా పెద్ద పెద్ద చదువులు చదివిస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే పొరబాటు అవుతుంది.. ప్రతి సంవత్సరం లక్షలమంది విద్యార్థులు తమ విద్యాభ్యాసం పూర్తి చేసి బయటకు వస్తున్నారు.. ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి..? మహా అయితే ఒక పదిశాతం మందికి మాత్రమే లభిస్తున్నాయి.. మిగతా అందరూ ఇదొక పని చేసుకుని బ్రతికేస్తున్నారు.. విజ్ఞానం కోసం చదువు ఉండాలి కానీ.. ర్యాంకుల కోసం చదవడం మూర్ఖత్వం అవుతుంది..
ర్యాంకులతో ఉద్యోగాలు రావు.. ఎందుకూ పనికిరాని ర్యాంకులకోసం నారాయణలాంటి విద్యాసంస్థలు చెబుతున్న మాయమాటలు విని లక్షలు పోసి చేర్పించడం ఎంతవరకు సమంజసం..? పెద్ద చదువులు చదివిస్తున్నామని ఆలోచిస్తున్నారే తప్ప వారి జీవితాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని తల్లిదండ్రులు ఎందుకు ఆలోచించడం లేదు.. పేరెంట్స్ బలహీనతలను తమకు అనుగుణంగా మార్చుకుని కోట్లకు పడగలెత్తుతున్న నారాయణ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలను తక్షణమే చరిత్ర నుంచి తొలగించాలని సామాజికవేత్తలు, విశ్లేషకులు సూచిస్తున్నారు..
