మైన్స్, జియాలజీ అధికారులు చేసిన దర్యాప్తులో 35,726.25 మెట్రిక్ టన్నుల గ్రావెల్ను అక్రమంగా తవ్వి తరలించిన నిజం బట్టబయలైంది. దీనిపై శాఖ రూ. 7,14,525/- సాధారణ సీజ్‌నియరేజ్ ఫీజుకు 10 రెట్లు పెనాల్టీతో కలిసి మొత్తం రూ. 78,59,775/- డిమాండ్ నోటీసు జారీ చేసింది.
- 78 లక్షల పెనాల్టీ వేసినా.. ఒక్క రూపాయి కూడా చెల్లించని వైనం ..
- తాజాగా.. మరికొన్ని లక్షలు పెనాల్టీగా వేసిన ఖాతరు చేయని నమిశ్రీ..
- రూల్స్ సామాన్యులకేనా..? మాఫియాలకు కాదా..? అని ప్రశ్నిస్తున్న స్థానికులు
- ప్రభుత్వం, అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే, రేపటికి ఈ ప్రాంతం మరో బాలాపూర్ గ్రావెల్ స్కామ్ లా మారిపోవడం ఖాయమని స్పష్టం..
వనస్థలిపురం-మాన్సూరాబాద్ ప్రాంతం నేడు అక్రమ తవ్వకాల అరాచకానికి అడ్డాగా మారిపోయింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా..మట్టి, గ్రావెల్ పేరుతో కోట్ల రూపాయల ఖనిజాన్ని కొల్లగొడుతూ.. మైనింగ్ మాఫియా ఇక్కడ రాజ్యమేలుతోంది. ఇందులో అగ్రగామిగా నిలుస్తున్నది ‘నమిశ్రీ ఇన్ఫ్రాస్టక్చర్’ అనే సంస్థ. ప్రభుత్వ ఆదేశాలనైనా, అధికారుల హెచ్చరికలనైనా, చట్టాల శిక్షలనైనా లెక్కచేయకుండా.. తమకిష్టమొచ్చినట్టుగా భూమిని చెండాడుతూ, అక్రమ తవ్వకాలను నిర్లజ్జగా కొనసాగిస్తూనే ఉంది.
రంగారెడ్డి జిల్లా, సరూర్నగర్ మండలం మాన్సూరాబాద్ గ్రామం సర్వే నంబర్ 38 ప్రాంతంలో భారీగా గ్రావెల్ తవ్వి అక్రమంగా రవాణా చేసిన అంశం వెలుగులోకి వచ్చింది. భూగర్భ శాఖ సాంకేతిక సిబ్బంది 21 జూన్ 2024న నిర్వహించిన తనిఖీల్లో, ఎల్బీ నగర్ చౌరస్తా నుండి తూర్పు దిశగా సుమారు 6 కిలోమీటర్ల దూరంలో, ఎంఈ రెడ్డి గార్డెన్ ఎదురుగా ఉన్న ఆటోనగర్ పార్కింగ్ ప్రాంతంలో ఐదు అసమానాకార గ్రావెల్ గుంతలు తవ్వబడ్డాయని గుర్తించారు. తనిఖీ సమయంలో స్థానిక ప్రాంతాలైన ఇందిరానగర్ ఫేజ్-2, విజయశ్రీ కాలనీ, చిత్రసీమ నగర్ పరిధిలో కూడా అక్రమ తవ్వుకాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు..దీంతో భూగర్భ శాఖ అధికారులు మరింత లోతయిన దర్యాప్తు కొనసాగించారు..

78 లక్షల పెనాల్టీ వేసినా..
ఒక్క రూపాయి కూడా చెల్లించని నమిశ్రీ..
మైన్స్, జియాలజీ అధికారులు చేసిన దర్యాప్తులో 35,726.25 మెట్రిక్ టన్నుల గ్రావెల్ను అక్రమంగా తవ్వి తరలించిన నిజం బట్టబయలైంది. దీనిపై శాఖ రూ. 7,14,525/- సాధారణ సీజ్నయరేజ్ ఫీజుకు 10 రెట్లు పెనాల్టీతో కలిసి మొత్తం రూ. 78,59,775/- డిమాండ్ నోటీసు జారీ చేసింది. ఇంత భీకరమైన జరిమానా పడినప్పటికీ నమిశ్రీ ఇన్ఫ్రాస్టక్చర్ యాజమాన్యం ఈ రోజు వరకు ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం గమనార్హం.. అధికారుల నోటీసులు కాగితాలకే పరిమితమయ్యాయి.. కానీ కంపెనీ అక్రమాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి..
తాజాగా.. కోట్లను దాటిన పెనాల్టీ..
గతంలో అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ నోటీలులిచ్చి పెనాల్టీ వేసినప్పటికీ నమిశ్రీ ఇన్ఫ్రా అక్రమ తవ్వకాలకు మాత్రం బ్రేక్ వేయలేదు. ఎలాంటి భయం లేకుండా నిస్సిగ్గుగా అదే దోపిడీ కొనసాగిస్తూ వస్తోంది.. పగలు, రాత్రి గ్రావెల్ను ఎత్తుకెళ్లడమే కాదు.. స్థానికులకు కాలుష్యం, ట్రాఫిక్, శబ్దం పేరుతో నరకయాతన సృష్టిస్తుంది.. ప్రభుత్వ ఖజానాకు నిరంతరం భీకర నష్టం కలిగిస్తోంది. పైనుంచి హెచ్చరికలొచ్చినా, పెనాల్టీలు కోట్లకు చేరినా.. నమిశ్రీ దూకుడు మాత్రం ఎక్కడా తగ్గించడం లేదు.. దీంతో అధికారులు మరోసారి నోటీసులిచ్చి కోట్ల రూపాయల పెనాల్టీలు విధించారు. అయినప్పటికీ కంపెనీ యాజమాన్యం మాత్రం చలనం లేనట్లు ప్రవర్తిస్తుంది..

స్థానికుల ఫిర్యాదులు కోకొల్లాలైన తవ్వకాలు మాత్రం ఆగడం లేదు..
మాన్సూరాబాద్ గ్రామం నుంచి ఇంద్రా నగర్, విజయ శ్రీ కాలనీ, చిత్తరసీమ నగర్ వరకు, ప్రతీ ఇంటి నుంచి ఒకే అరుపు వినిపిస్తోంది. “రాత్రింబవళ్లు యంత్రాలు గర్జిస్తున్నాయి.. రోడ్లన్నీ ట్రక్కుల దూకుడుతో నాశనమైతున్నాయి.. గాలిలో దుమ్మే దుమ్ము, పిల్లలు, పెద్దలు శ్వాస తీసుకోవడమే కష్టమైంది” అని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు.. ఫిర్యాదులు వరుసగా ఇవ్వడం, తనిఖీలు చేయడం ..ఇవన్నీ మైన్స్ శాఖ ఇక్కడ నిత్యకృత్యమైనప్పటికీ నమిశ్రీ సంస్థ అక్రమ తవ్వకాలు మాత్రం ఒక్క రోజుకూడా ఆపడంలేదు.
అధికారుల ఆదేశాలు పేపర్లకే పరిమితమా..?
తాజాగా అసిస్టెంట్ డైరెక్టర్, మైన్స్ & జియాలజీ నుంచి జీహెచ్ ఎంసీ, తహసీల్దార్, వనస్థలిపురం పోలీసులకు అధికారిక లేఖలు వెళ్లాయి. అక్రమ తవ్వకాలను వెంటనే ఆపండి.. పహారా పెంచండి.. ప్రభుత్వానికి నష్టం జరుగుతోంది… అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ తవ్వకాలు మాత్రం ఆపడంలేదు.. నిజానికి అర్ధం కానీ విషయమేమిటంటే ఈ మైనింగ్ మాఫియా రెచ్చిపోవడానికి వెనక ఉన్న అదృశ్య హస్తం ఎవరిదీ..? కోట్ల రూపాయల పెనాల్టీలు పడినప్పటికీ వసూలు ఎందుకు కావడం లేదు..?.. అక్రమ మైనింగ్ కేసులు నమోదు అయ్యి ఉంటే.. తవ్వకాల యంత్రాలు ఇంకా రోజూ ఎలా పనిచేస్తున్నాయి..?.. చట్టాలు ఉన్నా, ఆదేశాలు ఉన్నా.. అమలు లేకుంటే అవన్నీ కాగి తాల గుట్టలే.అధికారుల నిశ్శబ్దం, మాఫియాకు రక్షణ కవచంగా మారిందనే సందేహాన్ని
ప్రజలు బలంగా వినిపిస్తున్నారు..
రూల్స్ సామాన్యులకేనా..?
మాఫియాలకు కాదా..?
ఈ మొత్తం వ్యవహారం అధికార యంత్రాంగానికే పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగులుస్తోంది. ఒక చిన్న కాంట్రాక్టర్ చిన్న తప్పు చేసినా చట్టం కఠినంగా పంజాలు రెండూ వెంటనే పనిచేస్తుంది, జరిమానాలు, పడతాయి. కానీ కోట్ల విలువైన ఖనిజాన్ని దోచుకుంటున్న కంపెనీ విషయంలో మాత్రం అదే అధికారులు.. అదే చట్టాలు.. అలా బలహీనంగా, నిస్సహాయంగా కనిపించడమంటే ఆశ్చర్యమా, అనుమానాస్పదమా అన్న సందిగ్ధంలో ప్రజలు నిలిచిపోయారు.
వనస్థలిపురం-మాన్సూరాబాద్ ప్రాంతం నేడు ప్రభుత్వ ఆదాయానికి బదులుగా అక్రమ మైనింగ్ మాఫియాకు అద్దెరాసే ప్రాంతంగా మారిపోయింది. ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఖనిజం.. ప్రైవేట్ మాఫియా జేబుల్లోకి జారిపోతోంది. ఈ అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోకపోతే..రేపటికి ఈ ప్రాంతం మరో ‘బాలాపూర్ గ్రావెల్ స్కామ్’గా దేశం ముందుకు రావడం ఖాయం.
రూల్స్ సామాన్యులకేనా..? రియల్ మాఫియాలకు కాదా ?..
ఈ వ్యవహారం మొత్తం అధికార యంత్రాంగాన్ని కూడా తప్పుబడుతోంది… ఎవరైనా చిన్న కాంట్రాక్టర్ తప్పు చేస్తే చట్టం కఠినంగా పని చేస్తుంది. కానీ కోట్లకోట్లు ఖనిజాన్ని దొంగిలించిన కంపెనీపై మాత్రం అధికారాలే బలహీనంగా కనిపించడం ఆశ్చర్యకరం. వనస్థలిపురం- మాన్సూరాబాద్ ప్రాంతం నేడు ప్రభుత్వానికి ఆదాయం వనరుగా ఉన్న ప్రాంతం.. కానీ నేడు ప్రైవేట్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయిన ప్రాంతంగా మారిపోయింది. ఈ అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం, అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే రేపటి తరానికి ఈ ప్రాంతం మరో బాలాపూర్ గ్రావెల్ స్కామ్ల మారిపోవడం ఖాయమని స్థానిక ప్రజలు వాపోతున్నారు.. మరిన్ని ఆధారాలతో మరో కథనం ద్వారా మీ ముందుకు రానుంది ఆదాబ్ హైదరాబాద్ మా అక్షరం.. అవినీతిపై అస్త్రం..
