- కేంద్రానికి మంత్రి సీతక్క కృతజ్ఞతలు
- క్రెచ్ వర్కర్ల వేతనాలు పెంచాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి
నిర్భయ నిధి కింద కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు” (Inclusive Cities for Women and Girls) కార్యక్రమానికి తెలంగాణలోని ములుగు జిల్లా ఎంపికైంది. ఇందుకు గాను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవిని రాష్ట్ర మంత్రి సీతక్క శనివారం ఢిల్లీలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ పథకం ద్వారా ములుగులో మహిళలు, బాలికల భద్రత కోసం పటిష్టమైన నిఘా, అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) తయారీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర మంత్రికి సీతక్క స్పష్టం చేశారు.
‘పాలనా’ (మిషన్ శక్తి) పథకం కింద పనిచేస్తున్న క్రెచ్ వర్కర్లు, హెల్పర్ల గౌరవ వేతనాలను పెంచాలని మంత్రి సీతక్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దాదాపు 25 మంది పిల్లల బాధ్యత చూసుకుంటున్న వర్కర్లకు నెలకు రూ.5,500, హెల్పర్లకు రూ.3,000 మాత్రమే చెల్లించడం వారి శ్రమకు తగిన ప్రతిఫలం కాదన్నారు. పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా వారి వేతనాలు పెంచి, సిబ్బందికి అండగా నిలవాలని కేంద్ర మంత్రిని కోరారు.
