- బెంగాల్లో మహా జంగిల్ రాజ్
- చొరబాటుదారులకు అండగా మమత బెనర్జీ..
- అందుకే రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణను వ్యతిరేకిస్తోందని విమర్శ
తృణమూల్ కాంగ్రెస్ సారథ్యంలోని పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చొరబాటుదారులను కాపాడుకునేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని, బెంగాల్లో చొరబాటుదారులకు టీఎంసీ ప్రాపకం లభిస్తోందని విమర్శించారు. తహెర్పూర్ శనివారంనాడు జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఫోనులో ప్రధాని మాట్లాడుతూ, పశ్చిమబెంగాల్లో టీఎంసీ ‘మహా జంగిల్ రాజ్కు బీజేపీ చరమగీతం పాడుతుందని చెప్పారు. అవినీతి, ఆశ్రితపక్షపాతం, బుజ్జగింపు రాజకీయాలు రాష్ట్రాన్ని ఏలుతున్నాయని ఆరోపించారు. ‘వాళ్లు బీజేపీని ఎంత గట్టిగానైనా వ్యతిరేకించనీయండి. కానీ పశ్చిమబెంగాల్ అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారో నాకయితే అర్ధం కావడం లేదు. మీరు మోదీని వ్యతిరేకించండి, కానీ ప్రజల సంతోషాన్ని అడ్డుకోకండి.
ప్రజల హక్కులను కాలరాయకండి. వారి కలలను చెల్లాచెదురు చేసే పాపానికి ఒడికట్టకండి. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వమని పశ్చిమబెంగాల్ ప్రజలకు ముకుళిత హస్తాలతో వేడుకుంటున్నాను’ అని మోదీ విజ్ఞప్తి చేశారు. కాగా, వాతావరణ ప్రతికూలత కారణంగా మోదీ హెలికాప్టర్ తహెర్పూర్లో దిగలేకపోయింది. దీంతో ఆయన కోల్కతా విమానాశ్రయానికి తిరిగి వెళ్లిపోయారు. పశ్చిమబెంగాల్లోని నదియా జిల్లా రణఘాట్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. వీటిలో రూ.3,200 కోట్లతో నిర్మించనున్న రెండు జాతీయ రహదారి ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు కోల్కతాను సిలిగురితో అనుసంధానిస్తూ సుమారు రెండు గంటల ప్రయాణ సమయం ఆదా చేస్తాయని పీఎంఓ తెలిపింది. ఈ ప్రాజెక్టులతో ఆర్థిక కార్యకలాపాలు విస్తృతం కావడంతో పాటు పర్యాటకం కూడా పెరుగుతుందని పేర్కొంది.
