సితాఫలమండీ డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు కనకం కుమార్ ఆకస్మిక మృతి పట్ల సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తిగుళ్ల పద్మారావ్ గౌడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మేడిబావి ప్రాంతంలోని కుమార్ నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ మాట్లాడుతూ కనకం కుమార్ పార్టీ పట్ల అచంచల నిబద్ధతతో పనిచేసిన కృషిశీల నాయకుడని పేర్కొన్నారు.సితాఫలమండీ డివిజన్‌లో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుండి పోరాడిన వ్యక్తిగా గుర్తు చేసుకున్నారు.స్థానిక అభివృద్ధి కార్యక్రమాల్లోనూ,పార్టీ కార్యక్రమాల్లోనూ చురుకైన పాత్ర పోషించారని తెలిపారు.
కుమార్ మరణం పార్టీకి,ముఖ్యంగా సితాఫలమండీ ప్రాంతానికి తీరని లోటని అన్నారు.ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి,అందరికీ అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారని గుర్తుచేశారు.ఇలాంటి సేవాభావి నాయకుడిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.ఈ సందర్బంగా పార్టీ శ్రేణులు,స్థానిక నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కనకం కుమార్‌కు నివాళులర్పించారు.
