ఐదు నెలలుగా వాయిదా వేస్తున్న మిషన్ భగీరథ ఉద్యోగుల జీతాలను ప్రభుత్వం వెంటనే విడుదల చెయ్యాలని బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్(RS. Praveen kumar) డిమాండ్ చేశారు. జీతాల వెంటనే విడుదల చెయ్యకపోతే ధర్నా చేపడతాం అని ఆయన హెచ్చరించారు. మిషన్ భగీరథ ఉద్యోగులతో ఆయన సోమవారం కాగజ్ నగర్ లో ముచ్చటించారు.
మిషన్ భగీరథ అమలు లో ఉద్యోగులది కీలక పాత్ర అని ఆయన అన్నారు. వాటర్ ట్యాంక్ లను శుభ్రపరచడం, ఇంటింటికి మంచి నీరు సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని ఆయన అన్నారు. “జీతాలు రాక ఉద్యోగులకు చాలా కష్టంగా ఉంది. వారి రోజు వారి ఖర్చులు ఎలా వెల్లదీస్తారు. అందరు దసరా పండుగ జరుపుకుంటే వారు మాత్రం పస్తులు ఉండాలా” అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రికి, ఆయన ఎమ్మెల్యే లకు జీతాలు సరిగ్గానే వస్తున్నాయా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. L&T లాంటి కంపెనీలు లాభాలు మూట కట్టుకుంటుంటే, కష్టపడి పని చేస్తున్న ఉద్యోగులు మాత్రం జీతాల్లేక పస్తులు ఉండాలా అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. పంచాయతీ రాజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణ రావు వెంటనే జోక్యం చేసుకుని పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు.