ఇలా తీర్చిదిద్దటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
ఎస్‌సీఎస్‌సీ కాంక్లేవ్-2025లో మంత్రి శ్రీధర్ బాబు
పౌరుల భాగస్వామ్యంతోనే సైబర్ మోసాలకు అడ్డుకట్ట పడుతుందని వెల్లడి
డిజిటల్ సేఫ్టీలో తెలంగాణ(Telangana)ను ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్(Role Model)గా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని (Government Target) ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి (IT and Industries Minister) శ్రీధర్ బాబు (Sridhar Babu) అన్నారు. దీనికి అనుగుణంగా తెలంగాణ రైజింగ్ విజన్-2047 డాక్యుమెంట్(Telangana Rising Vision-2047 document)లో సమగ్ర రోడ్ మ్యాప్‌ను పొందుపర్చామని చెప్పారు. గురువారం హెచ్ఐసీసీలో నిర్వహించిన సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(SCSC) కాంక్లేవ్(Conclave)-2025ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రోజుకో తరహా మోసాలకు పాల్పడుతూ సైబర్ నేరగాళ్లు సవాల్ విసురుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది దేశవ్యాప్తంగా 265 మిలియన్లకు పైగా సైబర్ దాడులు జరిగాయని తెలిపారు. తెలంగాణ కీలక రంగాల సంస్థలపై గతేడాది 17 వేలకు పైగా రాన్సమ్‌వేర్ దాడులు జరిగినట్లు ఓ ప్రముఖ సెక్యూరిటీ సంస్థ అధ్యయనంలో తేలిందని పేర్కొన్నారు. ‘ఒక్క సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఏడాది వ్యవధిలో రూ.800 కోట్లకు పైగా సొమ్మును సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టడం వాస్తవ పరిస్థితికి నిదర్శనం. ఇలాంటి తరుణంలో సాంప్రదాయ పోలీసింగ్ కాకుండా స్మార్ట్ పోలీసింగ్ అవసరం. పౌరుల భాగస్వామ్యంతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలం.
మోసం జరిగిన తర్వాత కాకుండా ముందే స్పందించి సైబర్ నేరగాళ్లను కట్టడి చేసే వ్యవస్థ అవసరం. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ డేటా సిస్టమ్స్, రియల్ టైం మానిటరింగ్, ఓపెన్ ఇన్ఫర్మేషన్ లాంటి అధునాతన వ్యవస్థల ద్వారా ప్రభుత్వం పౌరుల డిజిటల్ సేఫ్టీకి చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు సైబర్ నేరాల కట్టడిపై అవగాహన కల్పిస్తూ వారిని వారియర్స్‌గా తీర్చిదిద్దుతున్నాం’ అని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్, ఏడీజీపీ చారుసిన్హా, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఎస్‌సీఎస్‌సీ సెక్రెటరీ జనరల్ రమేష్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.
