ప్రజాస్వామ్యంలో గ్రామాలు బలంగా ఉంటేనే రాష్ట్రాలు, దేశం అభివృద్ధి
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా బాధ్యతతో పనిచేయండి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సర్పంచ్‌ల సన్మానోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
పౌర సేవల(Civil Services)ను ప్రజల ముంగిటకు తెచ్చేందుకు గ్రామాలను డిజిటల్ విలేజ్‌లు(Digital Villages)గా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు కొత్త సర్పంచ్‌ల(Sarpanchs)కు సూచించారు. టెక్నాలజీ(Technology)ని అందిపుచ్చుకునే ప్రక్రియలో గ్రామ పంచాయతీల(Gram Panchayat)కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పారు. గ్రామీణులకు మేలు చేయాలనే గొప్ప సంకల్పంతో యూపీఏ(UPA Government) హయాంలో ప్రారంభమైన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని(Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme) నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందని విమర్శించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లను ఆదివారం శంషాబాద్‌లోని కేఎల్‌సీసీ ఫంక్షన్ హాల్‌లో ఆయన ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..
‘ప్రజాస్వామ్యంలో గ్రామం అనేది పునాది. అది బలంగా ఉంటేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి పథంలో పయనిస్తాయి. పదవీకాలం ముగిసే లోపు మా సర్పంచ్ మా గ్రామాన్ని పూర్తిగా మార్చేశాడని ప్రజలు చెప్పుకునేలా పనిచేయాలి. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను చివరి వ్యక్తి వరకు అందేలా పారదర్శకంగా కృషి చేయాలి. గ్రామ స్వరాజ్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీలకు దండిగా నిధులు కేటాయిస్తాం. కొత్త సర్పంచ్‌లపై బృహత్తరమైన బాధ్యత ఉంది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేయాలి. గెలిచామనే గర్వంతో కాకుండా గ్రామాభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేయాలి.
గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాల ఏర్పాటు లాంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. గ్రామాల్లోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలి. అందరి భాగస్వామ్యంతో ఈ ఐదేళ్లలో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలి. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బిల్లులు రాక ఎంతో మంది సర్పంచ్‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటిని దశల వారీగా క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతాం. దశల వారీగా సర్పంచ్‌లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. హుందాగా శాసన సభ సమావేశాలు నిర్వహిస్తాం. ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని ధీటుగా తిప్పికొడతాం’ అని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, వీర్లపల్లి శంకర్, రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి, వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ తదితరులు పాల్గొన్నారు.
