- సాధారణ భక్తులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాము
- రాజకీయ,అధికార వీఐపీలు ఒత్తిడి చేయొద్దు!
- నేటి నుంచి గద్దెల మీదికి భక్తులను అనుమతించం:మంత్రి సీతక్క
లక్షలాది మంది భక్తులు తరలివచ్చే మేడారం మహాజాతరకు మేడారం దేవతల పలహారం మాదిరిగా రాజకీయ, అధికార వీఐపీ, వీవీఐపీలకు జాతర పాసులను మంజూరు చేయలేమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి సీతక్క పేర్కొన్నారు.మేడారం లో ఆమె మీడియాతో పిచ్చాపాటి గా మాట్లాడారు. వీఐపీలు పబ్లిక్ గా వస్తేనే గొప్పతనంగా ఉంటుందని చెప్పారు. జాతర ప్రారంభం బుధవారం నుంచి ఉన్నందున ఇకపై గద్దెల మీదికి డైరెక్టుగా భక్తులను అనుమతించేది లేదని, క్యూ ద్వారా దర్శనం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జాతరలో వి.ఐ.పి,వి.వి.ఐ.పి పాసుల జారీని రద్దు చేసేందుకు ఆలోచిస్తు న్నట్టు తెలిపారు.
ప్రతి భక్తుడు క్రమశిక్షణగా స్వీయ నియంత్రణ పాటించి క్యూ ద్వారా వస్తేనే బాగుంటుందని అన్నారు.మేడారంలో పరిస్థితులు గతంలో లాగాలేవని, ప్రస్తుతం రోడ్లు, క్యూలు,వీధులు వెడల్పు అయ్యాయని తెలిపారు. స్థానిక, స్థానికేతర ప్రజాప్ర తినిధులను గౌరవించి ఇప్పటికే పాసులు జారీ చేశామన్నారు. పాసుల కోసం అధికారులు, ప్రజాప్రతినిధులను ఒత్తిడి చేయవద్దని, వీఐపీలు క్రమశిక్షణగా వ్యవహరించాలని సూచించారు. సాధారణ భక్తుల కోసం వీఐపీలు సైతం పునరాలోచన చేయాలని మంత్రి కోరారు.
