కొత్త సర్పంచ్‌లకు మంత్రి పొన్నం సూచన
మొదటి గ్రామ సభలో కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలపండి
గాంధీ, నెహ్రూ, ఇందిర పేర్లపై బీజేపీ కుట్రపై ఆగ్రహం
అన్ని గ్రామాల్లో గాంధీ ఫొటోలతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనలు తెలిపాలని పిలుపు
కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme) పేరు మార్చడం(Name Change)పై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్(Gandhi Bhavan)లో మంత్రులు వివేక్ వెంకట్ స్వామి, అజారుద్దీన్ తదితర ముఖ్య నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు(Sarpanchs) తమ మొదటి గ్రామ సభలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ తీర్మానం(Resolution) చేయాలని సూచించారు. తిరిగి గాంధీజీ(Gandhi ji) పేరు చేర్చాలంటూ తీర్మానంలో పేర్కొనాలని కోరారు.
‘2004లో యూపీఏ ప్రభుత్వం సోనియాగాంధీ నేతృత్వంలో మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలను బతికించడానికి ఉపాధి హామీ పథకం తీసుకొచ్చారు. 2004కి ముందున్న ప్రభుత్వాల తీరు వల్ల ఏర్పడ్డ ఇబ్బందులను తొలగించడానికి అనేక మంది మేధావులు, సామాజికవేత్తలతో చర్చలు జరిపి వారి సలహాలు, సూచనలతో ఈ పథకానికి రూపకల్పన చేశారు. ప్రజల ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు లేకుండా వలసలు పోకుండా ఉండటానికి మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చి ప్రజల జీవితాలు మార్చింది. ఈ పథకం దేశం రూపురేఖలు మార్చింది. 2014 ఎన్నికల్లో ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు విస్తరిస్తామని బీజేపీ ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆది చేయకపోగా ఉన్న పథకానికి తూట్లు పొడుస్తోంది.
మహాత్మాగాంధీ పేరు తీసేసి జీ రామ్ జీ పేరు పెట్టారు. గతంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించే ఈ పథకంలో ఇప్పుడు 60:40 నిధులు భరించేలా చేసి రాష్ట్రాలపై మరింత భారం వేసింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపాధి హామీ పథకంపై చేసిన బిల్లుల మార్పుపై వెనక్కి తగ్గాలి. స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించి దేశ అభివృద్ధి నిర్మాణంలో మహోన్నత కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లింది. బీజేపీ ప్రభుత్వం గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీల చరిష్మాను చేరిపేయాలని చూస్తోంది. వారు చేసిన సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను ముందుంచాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అన్ని గ్రామాల్లో గాంధీ ఫొటోలతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనలు తెలిపాలి’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

