- ఫోరెన్సిక్ పైలెట్ ఆడిట్‌తో సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో అక్రమాల గుర్తింపు
- త్వరలో 31 జిల్లాల్లో కూడా ఫోరెన్సిక్ ఆడిట్
- ధరణి పోర్టల్ లొసుగుల వల్లే రిజిస్ట్రేషన్లలో అక్రమాలు
ధరణి పోర్టల్‌లోని లొసుగులను ఆసరాగా చేసుకొని ప్రభుత్వ భూములను కొల్లగొట్టినవారిని, రిజిస్ట్రేషన్‌ల చలానా సొమ్మును కాజేసినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) హెచ్చరించారు.
- ధరణి పోర్టల్(Dharani Portal)ను అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వంలోని పెద్దలు ప్రభుత్వ భూములను కాజేశారు. దీనిపై సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్ధతో పైలట్ ప్రాజెక్ట్ కింద ఫోరెన్సిక్ ఆడిట్(Forensic Audit) నిర్వహించాం. ఇందులో అనేక అవినీతి, అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక నివేదికలో తేలింది. ఈ ఫోరెన్సిక్ నివేదికను పరిశీలించిన తర్వాత మిగిలిన 31 జిల్లాల్లో కూడా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తాం
- ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడిన సంఘటనలపై ఏర్పాటు చేసిన ఉన్నతస్ధాయి కమిటీతో ఇవాళ సచివాలయంలో సమావేశం నిర్వహించారు.
- విచారణలో ఎదురైన అంశాలు, ఎవరి పాత్ర ఎంత? తెర వెనక ఎవరైనా ఉన్నారా? రెవెన్యూ అధికారుల పాత్ర ఏమైనా ఉందా? వంటి అంశాలపై కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నా. కమిటీ ప్రాథమిక నివేదికను పరిశీలించి మరికొన్నిసలహాలు సూచనలు చేస్తూ మరింత లోతైన విచారణ జరిపి తుది నివేదికను సమర్పించాలని సూచించాను.
- ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాత మొత్తంగా 52 లక్షల లావాదేవీలకు గాను 35 లక్షల లావాదేవీలను పరిశీలించాం. ఇందులో ప్రాథమికంగా 4848 లావాదేవీల్లో లోటుపాట్లు జరిగినట్లు గుర్తించాం. అయితే విచారణ తర్వాత 1109 డాక్యుమెంట్లకు సంబంధించి సుమారు రూ.4 కోట్లను ప్రభుత్వానికి చెల్లించలేదని కమిటీ సభ్యులు వివరించారు.
- ఆనాటి ప్రభుత్వం అనాలోచితంగా ఎలాంటి ముందుచూపు లేకుండా ఒక కుట్రపూరితంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌లోని లొసుగులను ఆసరాగా చేసుకొని కొంత మంది అక్రమాలకు పాల్పడితే భూభారతి పోర్టల్(Bhubharathi Portal) ద్వారా ఆడిట్ నిర్వహించి అక్రమాలను గుర్తించి తక్షణమే ఉన్నత స్ధాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టాం. ఇందుకు సంబంధించి 9 జిల్లాల్లోని 35 మండలాల్లో అక్రమాలకు పాల్పడిన 48 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం.
- వాస్తవ పరిస్దితి ఇలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న ఓ నాయకుడు వెయ్యి కోట్ల అవినీతి అని, మరో నాయకుడు పది వేల కోట్లు అని ఇంకొకరు భూభారతి పోర్టల్ అవినీతిమయమని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
- ఖమ్మం జిల్లాలో శిక్షణ పొందిన సర్వేయర్లకు జనవరి 25న లైసెన్స్‌ల అందజేత. ఇప్పటికే మొదటి విడతలో 4 వేల మంది శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్స్‌లు జారీ చేయగా జనవరి 25న ఖమ్మం కలెక్టరేట్‌లో మరో రెండు వేల మందికి లైసెన్స్‌లు జారీ చేస్తాం. ఈ లైసెన్స్‌డ్ సర్వేయర్లతో రాష్ట్రంలో నక్షా లేని 373 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తాం.
- ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇంటలిజెన్స్ అదనపు డీజీ విజయ్‌కుమార్, ఉన్నతస్ధాయి కమిటీ సభ్యులు డీఐజీ ఎం.సుభాషిణి, సీఎంఆర్‌వో మకరంద్, ఎసీబీ ఎస్పీ సింధు శర్మ, సైబర్ క్రైమ్ డీఎస్పీ ఎ.సంపత్, ఎన్ఐసీ ప్రతినిధి శ్రీనివాస్, హోం శాఖ సలహాదారు పి.శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
