- గింగిరాలు తిప్పుతున్న గిరిగిరి కిరికిరి దళారులు
- ఫైనాన్స్ పేరిట చిరు వ్యాపారులు, చమట చుక్కల ప్రజలే టార్గెట్
- రూ. పదికి పైనే వడ్డీ వసూళ్లు
- పట్టించుకోని అధికారులు
ములుగు జిల్లా వ్యాప్తంగా వందలాది మంది వడ్డీ వ్యాపారులు వేలాదిమంది పేద ప్రజల నడ్డి విరుస్తున్నారు. చీటీ, వారం వారం ఫైనాన్స్ వ్యాపారం. అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు.జిల్లాలో అక్రమ సంపాదన మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతుంది. ఎలాంటి అనుమతి లేకుండానే ప్రతి వారం కొందరు వచ్చి గ్రామాల్లోని చిరు వ్యాపారులను అడ్డాగా చేసుకొని వారి ఆవాసాలనే ఆసరాగా మలుచుకొని వడ్డీ వ్యాపారం చేస్తున్నారు.
జిల్లాలోని మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం,వాజేడు,వెంకటాపురం, తాడ్వాయి మండలకేంద్రలతో పాటు ఆయా ప్రాంతాల నుంచి కొందరు ఇక్కడ ఏజెంట్లతో వడ్డీ వ్యాపారం దీర్ఘకాలికo గా కొనసాగిస్తున్నారు. ఏజెన్సీలో ఎలాంటి వ్యాపారం చేయాలన్న 1/70 చట్టానికి లోబడి ఉండాలన్న నిబంధనలు ఉన్నాయి. చట్టవిరుద్ధమని నిబంధనలు ఉన్నా అధికారులు కట్టడి చేయడం లేదని మండలంలో ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.
రూ.10కి పైనే వడ్డీ….
ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని జిల్లాలోని ఆయా పది మండలంలోని చిరువ్యాపారులను ఆసరాగా చేసు కొని గిరిగిరి, ఫైనాన్స్ చిటీల రూపంలో అక్రమంగా సంపాదిస్తున్నారు. రూ.1,000 నుంచి మొదలు రూ.50వేల వరకు ఇస్తూ రూ.10 నుంచి రూ.20 మధ్యలో వడ్డీ వసూలు చేస్తుంటారు. తెల్లారక ముందే లేదా పొద్దు పోకముందే వారి ఇండ్లల్లో/షాప్ ల్లో వాలి రోజువారీగా/వారం వారం వసూలు చేసుకొని అధిక వడ్డీలు వేసి బాధితుల నడ్డి విరుస్తున్నారు. అధికారులు వారిపై దృష్టి సారించక పోవడంతో పలు విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫైనాన్స్ వడ్డీ వ్యాపారాన్ని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
