ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థి కేసు మానసిక ఆరోగ్య హక్కుల ప్రాధాన్యతను భారత దేశ గౌరవ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గుర్తు చేసింది
విద్యార్థి జీవితం ఒక అందమైన కల. కానీ ఆ కలను నశించే అత్యంత తీవ్రమైన క్షణాల్లో ప్రస్తుత విద్యావ్యవస్థ మానసిక ఒత్తిడి తో కొట్టు మిట్టాడుతోంది. పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు… ఇవన్నీ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే చోటు అవ్వాలి కానీ ప్రస్తుతం విద్యార్థులను ర్యాంక్ లను ఇచ్చే ఒక యంత్రం లాగా మాత్రమే చూస్తున్నాయి. యువత మనసులను వారి యొక్క ఆలోచనలను మెల్ల మెల్లగా నాశనం చేస్తున్నాయి.
ఇటీవల సుప్రీం కోర్టులో వచ్చిన ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థి కేసు, ఈ సమస్యను మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఈ విద్యార్థి బార్డర్లైన్ పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడుతూ, ఢిల్లీకి బదిలీ కావాలని కోరాడు. ఎందుకంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డిల్లీ యందు తక్కువ ఖర్చుతో, తగిన సదుపాయాలు లభిస్తున్నాయి. అలాగే తల్లిదండ్రులతో కలసి ఉండటానికి ఆ బదిలీ అవసరమని ఆయన వాదించాడు. కానీ, అతని వినతిని పక్కన పెట్టడం జరిగింది. ఈ సమస్య కేవలం ఒక విద్యార్థి హక్కుల విషయమే కాదు. ఇది మన విద్యా వ్యవస్థలోని మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఒక అతి పెద్ద సవాల్. మానసిక సమస్యలను మౌనంగా, అర్థం చేసుకోకుండా వదులుకుంటే, వాటి ప్రభావం విద్యార్థుల శారీరక, భావోద్వేగ, సామాజిక జీవితాన్ని ప్రమాదానికి కారణం గా మారుతుంది..
న్యాయస్థానం, విద్యాసంస్థల కర్తవ్యం:
జూలైలో 2025, భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఒక చారిత్రాత్మక తీర్పులో చెప్పింది. మానసిక ఆరోగ్యం కూడా జీవన హక్కులో భాగం ఇది ఒక చారిత్రాత్మక మైన తీర్పు. కానీ ఆ తీర్పు ను ఎంతవరకు విద్యాసంస్థల్లో అమలు జరుగుతోంది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది అనడానికి ఇది ఒక మచ్చుతునక మాత్రమే. వెలుగు లోనికి రానివి మరెన్నో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ జాతీయ సంస్థలు, రాష్ట్ర ప్రతిస్తాత్మక విద్యాసంస్థలు ఇవన్నీ “కెరీర్” ను నిర్మించడంలో మాత్రమే కాకుండా, విద్యార్థుల మానసిక సంక్షేమానికి కూడా బాధ్యత వహించాలి. విద్యార్థులలో మానసిక స్థాయి తగ్గట్లుగా అవగాహన, సపోర్ట్, సదుపాయాలు ఇవన్నీ తప్పనిసరిగా కలిపించాల్సిన బాధ్యత ఉంది.
మన బాధ్యత
మానసిక సమస్యలను విద్యార్థి యొక్క గౌరవానికి, సమాజంలోని మనస్థితికి సంబంధించిన హక్కులు గా మాత్రమే పరిగణించాలి. విద్యార్థులు ఒత్తిడి, విఫలత, ఒంటరితనం, సైకాలజికల్ కష్టాల నుండి బయటకు రావడానికి మద్దతు ఇవ్వాలి. ప్రతి విద్యార్థి తన మానసిక సమస్యలను తేలికగా చెప్పుకొనే విధమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రతి విద్యాసంస్థలో అందుబాటులో కౌన్సెలింగ్ సెంటర్ ఉండాలి.
మానసిక ఆరోగ్యం తో విజయం సులువు
ఇది ఒక విద్యార్థి కథ మాత్రమే కాదు; ఇది మన సమాజం, మన పద్ధతులపై ఒక ప్రశ్న. ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్ విద్యార్థి కోర్టును ఆశ్రయించడం ద్వారా మానసిక ఆరోగ్య హక్కుల గురించి చర్చ మొదలైంది. ఇది ఒక కొత్త మార్గదర్శకం కావాలి. విద్యార్థుల మనసును అర్థం చేసుకోవడం, వారికి సరైన మద్దతు ఇవ్వడం ఇది ఇప్పుడు అత్యవసర కర్తవ్యం. విద్యార్థులు మన భవిష్యత్తు. వారి మానసిక ప్రశాంతత ఉంటే ఏదైనా వారు విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. మానసిక ఆరోగ్యం మనం కాపాడాల్సిన కాపాడుకోవాల్సిన మౌలిక హక్కు.
By – Dr. SRINIVAS REDDY ATLA