పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు
హైదరాబాద్: పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను (అక్టోబర్ 21 నుంచి 31 వరకు) పురస్కరించుకొని హైదరాబాద్ సిటీ పోలీసులు (Hyderabad City Police) నగరంలోని అన్ని జోన్లలో మొత్తం 12 రక్తదాన శిబిరాల(Blood Donation Camp)ను ఏర్పాటు చేసి సుమారు 3,500 మంది దాతలతో ఒక భారీ ‘మెగా రక్తదాన శిబిరం’ నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమర వీరుల మహోన్నత త్యాగాలకు నివాళిగా, సామాజిక సేవ పట్ల తమ నిబద్ధతను చాటుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా, వంశపారంపర్యంగా వచ్చే రక్త రుగ్మత అయిన థలసేమియా(Thalassemia)తో బాధపడుతున్న రోగులకు సహాయం అందించేందుకు ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది మరియు నగర పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర డిజిపి (DGP) బి. శివధర్ రెడ్డి, ఐపిఎస్ మాట్లాడుతూ, పోలీసు అమరవీరుల సంస్మరణ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. “రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానం. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి, ఏడాదికి కనీసం 2 నుండి 4 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు 8,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు, వారిలో చాలా మందికి సకాలంలో రక్తం అందకపోవడం ఒక కారణం,” అని అన్నారు. థలసేమియా రోగులకు ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం అవసరం అవుతుంది. థలసేమియా అనేది అవగాహనతో నివారించదగిన వ్యాధి అని పేర్కొంటూ, కొవిడ్(Covid) సమయంలో సైబరాబాద్ కమిషనర్‌గా విసి సజ్జనర్ (Sajjanar) చేసిన సేవలను స్మరించుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ, దాతలను అభినందించారు.
హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనర్, ఐపిఎస్ మాట్లాడుతూ, “యువత రక్తదానంలో స్వచ్ఛందంగా పాల్గొని, థలసేమియా నివారణపై అవగాహన కార్యక్రమాలలో చురుకుగా ఉండాలి” అని విజ్ఞప్తి చేశారు. నగరంలోని అన్ని జోన్లలో 12 క్యాంపుల ద్వారా 3,500 యూనిట్ల రక్తాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలకు నివాళిగా ఈ మెగా శిబిరం ఏర్పాటు చేసినట్లు పునరుద్ఘాటించారు. “ప్రజలు సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి, వారి శుభకార్యాల సందర్భంలోనూ రక్తదానం చేయడం అలవాటు చేసుకోవాలి. రోడ్డు ప్రమాదాలు మరియు ఎమర్జెన్సీ ఆపరేషన్లలో రక్తం చాలా అవసరం. ఈ రోజు సేకరించిన బ్లడ్ యూనిట్లను థలసేమియా రోగులకు అందజేస్తాం,” అని తెలిపారు.
ఈ మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన పోలీసు అధికారులు, థలసేమియా ఫౌండేషన్ & సికిల్ సెల్ సొసైటీ, రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్, రోటరీ క్లబ్ వంటి స్వచ్ఛంద సంస్థలకు, అలాగే ఉస్మానియా, గాంధీ, కింగ్ కోఠి, నిలోఫర్, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్స్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐపీఎం నారాయణగూడ, నిమ్స్, శ్రీనిధి బ్లడ్ బ్యాంక్స్ వంటి వైద్య సంస్థల ప్రతినిధులకు కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని సజ్జనర్ తెలిపారు.
రక్తదాన శిబిరాలు ఆబిడ్స్ డివిజన్ ఆఫీస్, మహారాణ ప్రతాప్ ఫంక్షన్ హాల్ (అంబర్‌పేట్), జయ గార్డెన్ (పంజాగుట్ట), బంజారా ఫంక్షన్ హాల్ (మాసబ్ ట్యాంక్), పద్మశాలి భవన్ (సికింద్రాబాద్), బషీర్ ఫంక్షన్ హాల్ (సౌత్ జోన్), కింగ్ క్లాసికల్ ఫంక్షన్ హాల్ (గుడిమల్కాపూర్) మరియు సిఏఆర్ హెడ్‌క్వార్టర్స్ (పెట్లబుర్జ్) మరియు ఇతర స్థలలో నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ (క్రైమ్) ఎం. శ్రీనివాస్, ఐపీఎస్, జాయింట్ సీపీ (లా & ఆర్డర్) తఫ్సీర్ ఇక్బాల్, ఐపీఎస్, డీసీపీ (సిఏఆర్ హెడ్‌క్వార్టర్స్) రక్షిత కృష్ణమూర్తి, ఐపీఎస్, కె.అపూర్వా రావు ఐపిఎస్ డిసిపి స్పెషల్ బ్రాంచ్, .అర్.వెంకటేశ్వర్లు ఐపిఎస్ డిసిపి ట్రాఫిక్, .జి.చంద్రమోహన్ ఐపిఎస్ డిసిపి సౌత్ వెస్ట్ జోన్, రీ.పి.లావణ్య నాయక్ జాదవ్ డిసిపి వుమెన్ సేఫిటీ మరియు ఇతర అధికారులు మరియు బ్లడ్ బ్యాంక్ కు సంబంధించి డాక్టర్లు, ప్రతినిధులు పాల్గొన్నారు.
