హన్మకొండ జిల్లా(Hanmakonda District)లో వివిధ అభివృద్ధి పనులపై మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే (StationGhanpur MLA) కడియం శ్రీహరి (Kadiyam Srihari) మంగళవారం హైదరాబాద్‌లో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. తాత్కాలిక ప్రాతిపదికన జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్(Sports School)-కం-సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, జాతీయ రహదారి 163కి ఆనుకొని హన్మకొండ జిల్లా ఉనికిచర్ల గ్రామం వద్ద అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం (International Cricket Stadium) నిర్మాణంపై యూత్ అడ్వాన్స్ మెంట్, టూరిజం కల్చర్ అండ్ స్పోర్ట్స్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేష్ రంజన్, వీసి & ఎండి స్పోర్ట్స్ అథారిటీ సోని బాలదేవితో హైదరాబాద్‌లోని సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ.. హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో తాత్కాలిక ప్రాతిపదికన స్పోర్ట్స్ స్కూల్ కం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు అవసరమైన అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు. క్రీడాకారులకు ఇండోర్, అవుట్ డోర్ క్రీడా మైదానాలు, ట్రాక్స్, హాస్టల్ వసతికి అవసరమైన మారమ్మతులు కూడా పూర్తి చేసినట్లు వెల్లడించారు. కావున ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభించేందుకు ప్రభుత్వపరమైన అనుమతులు ఇవ్వాలని కోరారు.
జాతీయ రహదారి 163కి అనుకోని హన్మకొండ జిల్లా ఉనికిచర్ల గ్రామం వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అనువైన స్థలం అందుబాటులో ఉందని తెలిపారు. హన్మకొండ జిల్లాలో క్రికెట్ స్టేడియం నిర్మాణం ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన జయేష్ రంజన్.. జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో తాత్కాలిక ప్రాతిపదికన స్పోర్ట్స్ స్కూల్ కం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను నవంబర్ 14లోపు ఏర్పాటుచేసేందుకు అనుమతులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. క్రికెట్ స్టేడియం నిర్మాణానికి హన్మకొండ జిల్లా కలెక్టర్‌ను ఫీజబిలిటీ రిపోర్ట్, స్థల సేకరణపై నివేదికను అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఆ నివేదికలు రాగానే క్రికెట్ స్టేడియం నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు..
